Mr Pregnant – Sohail : సాధారణంగా ఏదైనా గొప్ప పనిచేసిన మగాడిని ‘నువ్వు మగాడ్రా బుజ్జీ’ అని కొనియాడుతుంటాం. సినిమాల్లో హీరోలను ఇలానే అనేస్తుంటాం.. మగాడు చేసే మంచి పనులకు ఈ గుర్తింపు అవసరం. కానీ ఒక మాగాడు అమ్మాయిలా గర్భవతి అయితే.. వారి బాధను అనుభవిస్తే.. అందులో జీవిస్తే.. అదీ ఒక హీరో చేస్తే ఏమనాలి.. నిజంగానే అతడిని ‘మగాడ్రా బుజ్జీ’ అనాలి.
మన సమాజంలో కాస్త తేడాగా ఉంటేనే ‘వీడు మగాడేంట్రా తేడాగాడు’ అంటూ దెప్పిపొడుస్తుంటారు. ఇక్కడ వాళ్లను కించపరచడానికి మనం అనట్లేదు కానీ.. సమాజంలో జరిగే వివక్ష అలాంటిదే. అందుకే ట్రాన్స్ జెండర్లు తమ ఉనికి కోసం ఇప్పటికీ పోరాడుతుంటారు. తమను తాము మనుషులుగా చూపించమంటారు.
ఈమధ్యన ‘జైలర్’ సినిమాలో అంత పెద్ద సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక అనామక ఆర్టిస్ట్ అయిన తన కొడుకు, మనవడి పాత్రధారుల కాళ్ల బూట్లు తుడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పాత్ర కోసం ఇలాంటి పనులు చేసిన రజినీ సాహసమే ఆ చిత్ర విజయానికి కారణం. మన హీరోలు ఎంత సేపు తొడలు కొట్టడాలు.. కొడితే వందమంది లేచిపోవడాలే చూశాం. కానీ దక్షిణాది సూపర్ స్టార్ తనకంటే ఎంతో చిన్నవారి కాళ్ల బూట్లు తుడవడం అంటే అదీ హీరోయిజం.. పాత్రలో జీవించడం..
ఇప్పుడు మన సోహైల్ కూడా అదే పనిచేశాడు. ఒక వర్ధమాన యంగ్ హీరో అయినా అలాంటి సాహసం చేశాడు. తను ఒక అమ్మాయిలా మారిపోయాడు. సినిమాల్లో హీరోల మగతనం ఎలివేట్ చేస్తున్న ఈరోజుల్లో ఒక అమ్మాయిలా గర్భం బాధ అనుభవించే క్యారెక్టర్ లో ఒదగడం అంటే గట్స్ ఉండాలి. అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఏ హీరోకు అయినా ధైర్యం, దమ్ము టన్నుల్లో ఉండాలి. అదీ ఎదుగుతున్న సొహైల్ లాంటి వారు అయితే అస్సలు చేయరు. కానీ మన సోహైల్ మొండిగటం చేశాడు. అదే ఇటీవల ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అంటూ మనముందుకు వచ్చాడు.
సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఒక హీరో అమ్మాయిలా కడుపు తెచ్చుకోవడం అన్నది నిజంగా సాహసోపేతమైన చర్య. దీనికి నిజంగా మన సోహైల్ ను మెచ్చుకోవాల్సిందే. కడుపు తెచ్చుకున్న ‘సోహైల్’ ను నిజంగానే నెటిజన్లు ‘నువ్వు మగాడ్రా బుజ్జీ’ అని కొనియాడుతున్నారు.