Chandrababu- America: గత ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధికార పక్షం. మందీ మార్భలంతో పాటు నగదు పంపకాల్లో ఆ పార్టీ ముందుండాలి. వ్యవస్థలను మేనేజ్ చేయగలగాలి. పోల్ మేనేజ్ మెంట్ లో ముందుండాలి. కానీ అప్పట్లో సీన్ రివర్స్. అధికార టీడీపీ విపక్షమైంది.. విపక్షంలో ఉన్న వైసీపీ అధికార పక్షంలా చెలాయించింది. దీనికి కారణం టీడీపీ కేంద్ర ప్రభుత్వం సపోర్టు లేకపోవడమే. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు.. తనను కాదని వెళ్లిపోయిన టీడీపీకి నష్టం చేకూర్చేలా కేంద్ర పెద్దలువ్యవహరించారు. దానిని వైసీపీ బాగా వర్కవుట్ చేసుకుంది. మరోవైపు పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ తో చంద్రబాబు రాజకీయ వైరం పెంచుకున్నారు. ఏపీ కంటే ముందుగా వచ్చిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ను చావుదెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కేసీఆర్ 2019 ఎన్నికల్లో తిరిగి చంద్రబాబుపై రివేంజ్ తీసుకున్నారు. ఏకంగా వైసీపీకి రూ.1000 కోట్ల సాయమందించారన్న వార్తలు వచ్చాయి. అందరూ కలిసి అష్ట దిగ్బంధం చేసేసరికి చంద్రబాబుకు చుక్కలు కనిపించాయి. ఘోర పరాజయం ఎదురైంది. ఈ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రజా మద్దతు కూటగట్టడంతో పాటు ఆర్థిక వనరులు సమకూర్చుకునే పనిలో పడ్డారు.

తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికలు చావోరేవోలాంటివి. మరోసారి ఓటమి ఎదురైతే ఆ పార్టీకి గడ్డురోజులు తప్పవు. అందుకే చంద్రబాబు తన శక్తికి మించి పోరాడుతున్నారు. ఏడు పదుల వయసులో కూడా విశ్రమించడం లేదు. పార్టీకి ఏ మాత్రం చాన్స్ ఉందనుకున్నా అక్కడ వాలిపోతున్నారు. తన శక్తియుక్తులను కూడదీసుకొని మరీ పోరాటం చేస్తున్నారు. ఒక వైపు పొత్తుల వ్యూహం కొనసాగిస్తూనే పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అలాగే వచ్చే ఎన్నికలకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకునే పనిలో పడ్డారు. బీజేపీ మద్దతు కోసం ఆరాటపడుతోంది అందులో భాగమే. ఎన్నికల్లో అధికార వైసీపీ ఆగడాలను ఎదుర్కొనేందుకు వ్యవస్థపరమైన సపోర్టు అవసరం. అందుకే కొద్ది బలమున్న బీజేపీ స్నేహం కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. చివరకు బీజేపీ మద్దతు కోసం తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారంటే చంద్రబాబు వచ్చే ఎన్నికలను ఎంతగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారో అర్ధంచేసుకోవచ్చు.

అయితే ఒక్క ప్రజాబలంతోనే గట్టెక్కాలేమని చంద్రబాబుకు గత అనుభవాలు తేల్చిచెప్పాయి. అందుకే ఆర్థిక వనరులపై దృష్టిపెట్టారు. పార్టీలో పదవులు అనుభవించి నాలుగు రాళ్లు వెనుకేసుకున్నవారు జగన్ సర్కారుకు భయపడి పక్కకు వెళ్లిపోయారు. పార్టీ వైపు చూసేందుకు కూడా సాహసించడం లేదు. పారిశ్రామికవేత్తల నుంచి కూడా సాయమందకుండా చేశారు. అసలు టీడీపీ వైపు, చంద్రబాబు వైపు పారిశ్రామికవేత్తలు చూడకుండా ప్రభుత్వ పెద్దలు కట్టడి చేశారు. దీంతో దాదాపు టీడీపీకి ఉన్న ఆర్థిక వనరులన్నీ మైనస్ గా మారాయి. అయితే చంద్రబాబు ఇటువంటి సమయంలో తన మెదడుకు పదును పెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి రూ.500 కోట్లు ఊడిపడేలా ప్రణాళిక వేశారు. పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులకు నిధుల సమీకరణ బాధ్యతలు అప్పగించారు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని ఎన్ఆర్ఐ విభాగంలోని ప్రతినిధుల్లో ఎక్కువ మంది కమ్మ సామాజికవర్గం వారే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకుంటే కమ్మ సామాజికవర్గం మూలాలను జగన్ దెబ్బతీస్తాడని చంద్రబాబు వారిని హెచ్చరించారు. దీంతో వారు ఆ భయంతో అన్ని దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలను కలుస్తూ నిధులను సమీకరించే పనిలో పడ్డారు.