Chandrababu Arrest: చంద్రబాబు కేసుల విషయంలో నేడు కీలకం. ఇటు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో విచారణలు కొనసాగనున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు ఫైబర్ నెట్, అంగళ్ల అల్లర్ల కేసు విచారణలు జరగనున్నాయి. కోర్టుల ఆదేశాలు వెల్లడి కానున్నాయి. దీంతో చంద్రబాబుకు శుక్రవారం కీలకంగా మారింది.
అంగళ్ళ అల్లర్ల కేసుకు సంబంధించి చంద్రబాబుకి ముందస్తు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనే దానిపై ఇవాళ ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో చంద్రబాబు ఏ1 నిందితుడిగా ఉన్నారు. మొత్తం 179 మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు రెండు వైపులా వాదనలు విని.. తీర్పును రిజర్వులో ఉంచింది. ఇవాళ తీర్పు వెల్లడి కానుంది.
ఏపీ స్కిల్ స్కామునకు సంబంధించి చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ఈ కేసు కొట్టివేయాలని, తనను విడుదల చేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, సిఐడి తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు.
మరోవైపు ఫైబర్ నెట్ కేసులకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానుంది. ఇప్పటికే ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైంది. ఈ తరుణంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అది కోర్టులో రిజిస్టర్ అయి ఉంది. నేడు విచారణకు రానుంది. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్ర వాదనలు వినిపించనున్నారు. శుక్రవారం ఏకకాలంలో చంద్రబాబుకు చెందిన మూడు కేసులకు సంబంధించి విచారణలు కొనసాగనున్నాయి. దీంతో ఉత్కంఠ నెలకొంది.