Chandrababu- Balakrishna: నారావారిపల్లిలో సంక్రాంతి సందడి మొదలైంది. నారా, నందమూరి కుటుంబాలు నారావారిపల్లికి చేరుకున్నాయి. ఇరు కుటుంబాలు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్లో పాల్గొననున్నారు. వీరసింహారెడ్డి విడుదలైన మరుసటి రోజే బాలయ్య చిత్తూరు జిల్లాకు వెళ్లడంతో అభిమానుల్లో పట్టరాని సంతోషం వ్యక్తమవుతోంది. బాలయ్య వారసుడి ఎంట్రీ పైనే అభిమానులు ఎదురుచూస్తున్నారు.

గురువారం హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ ప్రత్యేక విమానంలో బయలుదేరారు. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో దిగారు. నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడ నారావారిపల్లికి ప్రత్యేక విమానంలో చేరుకుంది. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, అభిమానులు ఎయిర్ పోర్టుకు చేరుకుని స్వాగతం పలికారు. వీరసింహారెడ్డి విడుదలై విజయం సాధించడంతో అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. దారిపొడువునా జై బాలయ్య నినాదాలతో మార్ర్మోగించారు.
నారా, నందమూరి కుటుంబాలు నారావారిపల్లికి చేరిన సందర్భంగా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సెంటర్ ఆఫ అట్రాక్షన్ గా నిలిచారు. ఇంకా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వని మోక్షజ్ఞ అరంగేట్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది నందమూరి మోక్షజ్ఞ సినిమా అరంగేట్రం ఉంటుందని బాలకృష్ణ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏ డైరెక్టర్ చేతిలో సినిమా పెడతారు ? ఎలాంటి కథ ఎంచుకోబోతున్నారు ? అన్న ఆసక్తి బాలకృష్ణ అభిమానుల్లో నెలకొంది.

మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో నారా, నందమూరి కుటుంబం పాల్గొననుంది. భోగి, సంక్రాంతి, కనుమ సంబరాలు ముగియగానే కనుమ రోజు సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. వీరసింహారెడ్డి సక్సెస్ కావడం, మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇవ్వడం ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలతో పాటు అదనంగా కలిసొచ్చాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరసింహారెడ్డి తొలిరోజు రూ. 50 కోట్ల పై చిలుకు వసూళ్లు సాధించినట్టు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.