కరోనా కంట్రోల్: కేసీఆర్ కు మూడో ముప్పు

తెలంగాణ సీఎం కేసీఆర్ కల నెరవేరలేదు. నెరవేరే చాన్స్ కూడా కనిపించడం లేదు. ఏప్రిల్ చివరి వారం వరకు తెలంగాణ కరోనా ఫ్రీ అవుతుందని ఒకానొక విలేకరుల సమావేశంలో ఘనంగా చాటాడు. కానీ పరిస్థితి తలకిందులైంది. ప్రారంభంలో విదేశాల నుంచి తిరిగి వచ్చినవారితో తెలంగాణలో కరోనా వ్యాపించింది.. ఆ తర్వాత ఢిల్లీలో తబ్లిఘీ జమాత్ సమావేశానికి హాజరైన వారితో తెలంగాణలో రెండోదశలో కరోనా ముదిరింది. ఇప్పుడు తెలంగాణలో మూడో దశ కరోనా విస్తృతంగా వ్యాపించడానికి ఈ అంటువ్యాధి […]

Written By: admin, Updated On : May 14, 2020 8:21 pm
Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్ కల నెరవేరలేదు. నెరవేరే చాన్స్ కూడా కనిపించడం లేదు. ఏప్రిల్ చివరి వారం వరకు తెలంగాణ కరోనా ఫ్రీ అవుతుందని ఒకానొక విలేకరుల సమావేశంలో ఘనంగా చాటాడు. కానీ పరిస్థితి తలకిందులైంది. ప్రారంభంలో విదేశాల నుంచి తిరిగి వచ్చినవారితో తెలంగాణలో కరోనా వ్యాపించింది.. ఆ తర్వాత ఢిల్లీలో తబ్లిఘీ జమాత్ సమావేశానికి హాజరైన వారితో తెలంగాణలో రెండోదశలో కరోనా ముదిరింది. ఇప్పుడు తెలంగాణలో మూడో దశ కరోనా విస్తృతంగా వ్యాపించడానికి ఈ అంటువ్యాధి కాచుకు కూర్చుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

*వలస తెస్తున్న కరోనా ముప్పు
తెలంగాణకు వలసలు పోటెత్తుతున్నాయి. రైళ్లు ప్రారంభంతో బిహార్, యూపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు తెలంగాణ మిల్లులు, భవన ఇతర రంగాల్లో పనిచేయడానికి రైళ్లలో తరలివస్తున్నారు. తెలంగాణలో ధాన్యం విపరీతంగా ఉత్పత్తి కావడంతో మిల్లుల్లో హమాలీలుగా చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వలసదారులు పోటెత్తుతున్నారు. ఈ పరిణామంతోనే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత ఐదురోజులలో కనీసం 35 మంది వలసదారులకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. మొన్నటివరకు 10 లోపే కరోనా కేసులు వెలుగుచూసినా తెలంగాణలో ఇప్పుడు 50 దాటడం ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రం ప్రభుత్వానికి ఇదో హెచ్చరికగా మారింది. దీంతో వలసదారులను తనిఖీ చేసి పరీక్షలు చేశాకే అనుమతించాలని యోచిస్తున్నారు.

*తెలంగాణలో కంట్రోల్ కేసీఆర్ తో కష్టమేనా?

తెలంగాణలో మొట్టమొదటి కరోనా కేసు మార్చి 2న నిర్ధారణ చేశారు. ప్రతీసారి కరోనా కేసులు ఇక ముగిశాయని కేసీఆర్ భావిస్తూ విలేకరుల సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి సోకుతుందో తెలియని వ్యాధి వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్పుడు వలసదారులతో తెలంగాణ కొత్త సవాలును ఎదుర్కొంటోంది.గత నెలలోనే సీఎం కేసీఆర్, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయని.. మే 8 వరకు తెలంగాణలో అధిక రికవరీలు, డిశ్చార్జిలు జరిగి వ్యాధి నుంచి రాష్ట్రం విముక్తి చెందుతుందని ప్రకటించారు. కానీ కొన్ని రోజులుగా తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతుండడం వారి ఆశలను అడియాసలు చేస్తోంది.

*తలకుమించిన భారంగా వలసదారుల ట్రాకింగ్
విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిని.. తబ్లిఘీ జమాత్ కు హాజరైన వారిని వారి కాంటాక్టులను ఈజీగా గుర్తించి, పరీక్షలు జరిపిన తెలంగాణ సర్కారు ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే వలసదారులను ట్రాక్ చేయడం అధికారులకు తలకుమించిన భారం అవుతోంది. లాక్ డౌన్ సడలింపులతో చాలా మంది లారీలు, నడిచి, ఇతర మార్గాల్లో వివిధ రకాల మార్గాల ద్వారా పెద్ద సంఖ్యలో వలసదారులు, ప్రజలు తెలంగాణకు వస్తున్నారు. వీరిని గుర్తించడం అంత ఈజీకాదు.. ఇప్పటికే చాలా మంది గ్రామాలకు చేరుకున్నారు కూడా.. ఇప్పటివరకు 41805 మంది వలసదారులు రోడ్డు మార్గం ద్వారా తెలంగాణకు చేరుకున్నారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. 239 మంది రైలులో వచ్చారు. ఇక ఇతర దేశాల నుంచి విమానాల ద్వారా 798మంది వచ్చినట్టు అధికారులు తెలిపారు.

*మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ముప్పు
అన్నిటికంటే ఆందోళన కలిగించే విషయం ఏంటంటే దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది తెలంగాణకు వలస వచ్చినట్టు అధికారుల లెక్కల్లో తేలుతోంది. ప్రస్తుతం దేశంలోనే 26వేలకు కేసులకు పైగా నమోదై మహారాష్ట్ర అతలాకుతలంగా ఉంది. దీంతో వారి ద్వారా మన తెలంగాణలో కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఏర్పడింది.

*తెలంగాణలో ముసురుకున్న ముప్పు
రైళ్లు, ఇతర రవాణా మార్గాలను ఇప్పటికే సడలించడంతో చాలా మంది తెలంగాణకు వచ్చేశారు. ఇప్పుడు చెక్ పోస్టుల వద్ద సరైన స్క్రీనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ముందు చాలా మంది ఇప్పటికే తెలంగాణలో ప్రవేశించి వారి గ్రామాలకు చేరుకొని కరోనా బాంబులుగా ప్రమాదకరంగా ఉన్నారు. వలసదారుల రాకతో రెండు వారాలుగా కొత్త కేసులు కనిపించని 26 జిల్లాల్లో కొన్ని రెడ్ జోన్ లోకి మారిపోయే ప్రమాదంలో పడ్డాయి.

*వలస ముప్పును అరికట్టడం కష్టమే..
తెలంగాణకు సరిహద్దుగా ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ ఉన్నాయి. ఇక వలసదారులు లారీలు, రైళ్లు ఇతర మార్గాల ద్వారా వస్తూనే ఉన్నారు. ఇప్పటికే నిన్న 41 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇందులో 10మంది వలసదారులే ఉండడం గమనార్హం. మరణాల సంఖ్య 34కు చేరింది. తెలంగాణలో వలస కార్మికులు లేకపోతే పనులన్నీ ఆగిపోతాయి.. దీంతో వారిని రాకుండా అడ్డుకోలేం. అలాగని కరోనా ముప్పును నియంత్రించలేని పరిస్థితి. చూస్తుంటే మున్ముందు వలస ముప్పుతో తెలంగాణలో కరోనా కేసులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

-నరేశ్ ఎన్నం