విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం ముదురుతోంది. పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మే అధికారం తమకు ఉందని ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదుని హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చట్టబద్ధమైన అధికారాలతోనే తీసుకున్న నిర్ణయమని పేర్కొంది.
దీనిపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు కూడా కేంద్రానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం కూడా కౌంటర్ దాఖలు చేసింది. ప్లాంట్ ప్రైవేటీకరణకు పీఎం ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోవడంతో విచారణ తగదని అఫిడవిట్ లో పేర్కొంది.
దీనికి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. ఆయన మొదట్లోనే హైకోర్టులో పిటిషన్ వేశారు. అందులో విశాఖ ఉక్కుకు ఇప్పటివరకు కేంద్రం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. కానీ మరో రూ.30 వేల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేసుకుందని చెప్పారు.
అయితే లక్ష్మినారాయణ లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రం స్పందించలేదు. స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ అమ్మడం వల్ల ఎంత లాభం వస్తుందో చెప్పాలన్నారు. ఎంతకు అమ్ముతున్నారో కూడా చెప్పడం లేదని పేర్కొన్నారు. అయితే ప్లాంట్ అమ్మకానికి కారణాలు ఏమిటో కూడా చెప్పడం లేదన్నారు. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ లో ఏ అంశాలు కూడా లేకుండా చూసుకుందని ఆరోపించారు. ఏవో రాజకీయ దురుద్దేశాలతో పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.