కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ‘జన ఆశీర్వాద’ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మొన్న ఏపీలో పర్యటించిన మంత్రి.. విజయవాడ ఇంద్ర కీలాద్రిని దర్శించుకున్నారు. ప్రస్తుతం.. తెలంగాణలో పర్యటిస్తున్న మంత్రి.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేసిన మంత్రికి.. ఆలయ ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో పూర్తిగా కుదేలైందన్నారు. దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తనపై పెద్ద బాధ్యత పెట్టారని కిషన్ రెడ్డి చెప్పారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు వచ్చే జనవరి నుంచి చర్యలు వేగవంతం చేయనున్నట్టు మంత్రి తెలిపారు.
యునెస్కో గుర్తించిన 40 కేంద్రాలు దేశంలో ఉన్నాయని, వాటిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా.. తెలంగాణలోని ప్రఖ్యాత పండుగలు బతుకమ్మ, బోనాలు, మేడారం జాతరలను చిత్రీకరించి, దేశవ్యాప్తంగా చూపించబోతున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల పండుగలను కూడా గుర్తిస్తామని చెప్పారు.
భువనగిరి కోటను మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇది రాష్ట్ర సర్కారు పరిధిలో ఉందని, రోప్ వే ద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు కృషి చేయాలన్నారు. దీంతోపాటు భద్రాచలం, వేములవాడ ఆలయాలను కూడా అభివృద్ధి చేయాలని మంత్రి అన్నారు. శుక్రవారం రాత్రి యాదాద్రిలోని హరిత హోటల్ లో బస చేసిన మంత్రి కిషన్ రెడ్డి.. యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత మూడో రోజు యాత్ర ప్రారంభించారు.