కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ‘జనఆశీర్వాద్ యాత్ర’ పేరుతో విజయవాడ, తిరుపతిలో ప్రసంగించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్ప కూలిపోయిందని అన్నారు. తద్వారా పాలన ఏ మాత్రం సరిగా లేదని విమర్శించారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని కూడా ఆరోపించారు. కేంద్ర మంత్రి పర్యటనతో కాస్త మైలేజ్ వస్తుందని రాష్ట్ర బీజేపీ నేతలు సంబరపడ్డారు. కానీ.. మీటింగుల తర్వాత వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ఆతిథ్యం స్వీకరించడం వారిని నివ్వెరపరిచింది.
కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత నేరుగా జగన్ నివాసానికి వెళ్లారు కిషన్ రెడ్డి. అంతేకాదు.. అప్పటి వరకు ఆయన వెంట ఉన్న రాష్ట్ర నాయకులను పక్కన పెట్టేసి ఒక్కరే వెళ్లడం పార్టీ శ్రేణులను విస్మయ పరిచింది. పోనీ.. అధికారిక పర్యటన అని సర్దిచెప్పుకుందామన్నా.. ఆయన కేంద్ర మంత్రి హోదాలో అధికారికంగా రాలేదు. పార్టీ పనిమీద వచ్చారు. ఇదే.. ఇప్పుడు బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి వచ్చిన కిషన్ రెడ్డి.. సభల్లో వైసీపీని తిట్టిన ఆయన.. వెళ్లి జగన్ ఆతిథ్యం స్వీకరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
అటు వైసీపీ కూడా కేంద్రాన్ని విమర్శిస్తోంది. తమను అప్పులు చేశారని నిందిస్తున్నారని, కేంద్రం చేస్తున్న అప్పులేమైనా తక్కువా? అని ఎత్తి చూపుతోంది. అదీగాక.. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీ తనవంతుగా ప్రయత్నిస్తూనే ఉంది. మరి, ఇలాంటి పరిస్థితుల్లో.. కిషన్ రెడ్డి వెళ్లి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం ఎంత వరకు సబబు అని లోలోపల మదన పడుతున్నారు బీజేపీ నేతలు.
ఇప్పటికే.. రాష్ట్ర బీజేపీ నేతలు జగన్ ను సరిగా ఎదుర్కోలేకపోతున్నారనే అపవాదు ఉంది. ఆయన్ను ఎదుర్కొనేందుకు ఏవిధంగా ముందుకు సాగాలా? అని సమాలోచనలు చేస్తున్నారు. మరి, కేంద్ర మంత్రి వెళ్లి జగన్ మర్యాదలు అందుకుంటే.. తాము ఏమని సమాధానం చెప్పుకోవాలి? అని అంటున్నారుట కాషాయ నేతలు. కిషన్ రెడ్డి ఏ లక్ష్యంతో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారో తెలియలేదుగానీ.. ఈ పరిస్థితి రాష్ట్ర బీజేపీ నేతలకు సంకట స్థితినే తెచ్చి పెట్టిందని అంటున్నారు పరిశీలకులు.