
తెలంగాణలో గడిచిన ఆరేళ్లుగా సీఎం కేసీఆర్ కు ఎదురులేకుండా పోయింది. రాష్ట్రంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చాక టీఆర్ఎస్ సర్కార్ కు రోజుకో తలనొప్పి వచ్చిపడుతోంది. కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగానే కేసీఆర్ కొద్దిరోజులు అదృశ్యమవడం.. సచివాలయం కూల్చివేత.. మసీదు, గుడి నిర్మాణాలపై శిథిలాలు పడటం.. బీజేపీ ఎంపీపై దాడి వంటి అంశాలు టీఆర్ఎస్ ను ఇరుకున పెడుతోన్నాయి. ఇన్నాళ్లు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాట సాగింది. ప్రస్తుతం పరిస్థితులు మాత్రం కేసీఆర్ కు వ్యతిరేకంగా మారుతున్నట్లు కన్పిస్తోంది.
సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మించాలని ఏ మూహుర్తాన అనుకున్నారోగానీ ప్రతీసారి బ్రేకులు పడుతూనే ఉన్నాయి. సస్పెన్స్ థిల్లర్ ఎపిసోడ్ లా సచివాలయ కూల్చివేత కొనసాగుతోంది. టీఆర్ఎస్ సర్కార్ సచివాలయం కూల్చి కొత్తది కట్టడాన్ని నిరసిస్తూ విపక్షాలు, ప్రజాసంఘాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. దీనిపై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వగా ప్రభుత్వం కూడా చకచకా పనులు మొదలుపెట్టింది. ఇప్పటికే సచివాలయ కూల్చివేత పనులు 60శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఊహించినవిధంగా హైకోర్టు మరోసారి సచివాలయం కూల్చివేతలపై స్టే ఇచ్చింది.
కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ బాగానే పడిందిగా?
పాత సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మిస్తున్నందున తప్పనిసరిగా పర్యావరణ అనుమతులు ఉండాల్సిందేనని హైకోర్టు అభిప్రాయపడింది. పర్యావరణ అనుమతుల విషయంపై క్లారిటీ ఇవ్వాలంటూ కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని వాదించారు. ఇటువంటి విషయాల్లో కోర్టు తీర్పు ఏదైనా మీ వద్ద ఉంటే వాటిని సమర్పించాలని న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. దీంతో రేపటి వరకు స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ నేతలు సచివాలయ కూల్చివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కోర్టు కేంద్రం చేతిలో పెట్టడంతో కేసీఆర్ కు మరిన్ని ఇబ్బందులు తెచ్చేలా కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు ఒకడుగు ముందుకేసీ సచివాలయం కింద నిజాం గుప్తనిధులున్నాయని.. అందుకే అర్థరాత్రి కూల్చివేతలు మొదలెట్టారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ సచివాలయం కూల్చడం ఏంటని సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలోకి కేంద్రాన్ని కూడా కోర్టు లాగడంతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది.