జ‌ల జ‌గ‌డంపై కేంద్రం గెజిట్‌.. ఇకనుంచి అంతే!

ఇద్ద‌రి మ‌ధ్య‌ గొడ‌వ ఏదైనా కానీ.. ఎలాంటిదైనా కానీ.. వాళ్లిద్ద‌రే మాట్లాడుకొని సెట్ చేసుకుంటే స‌మ‌స్య ఏమీ ఉండ‌దు. కానీ.. పంచాయితీపెట్టి తీర్పు బాధ్య‌త‌ను వేరేవాళ్ల‌కు అప్ప‌జెప్పిన‌ప్పుడు మొత్తం తేడా వ‌చ్చేస్తుంది. వాళ్లు చెప్పే తీర్పును వీళ్లిద్ద‌రూ త‌లొంచుకొని, చేతులు క‌ట్టుకొని మ‌రీ వినాల్సి వ‌స్తుంది. ఇప్పుడు.. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నీటి పంచాయితీ విష‌యంలో ఇదే జ‌రిగింది. మీది త‌ప్పంటే.. మీదే త‌ప్పు అంటూ.. రెండు రాష్ట్రాలు పంచాయితీ పెట్టుకొని చివ‌ర‌కు సుప్రీం కోర్టుకు సైతం పంచాయితీ […]

Written By: Bhaskar, Updated On : July 17, 2021 1:27 pm
Follow us on

ఇద్ద‌రి మ‌ధ్య‌ గొడ‌వ ఏదైనా కానీ.. ఎలాంటిదైనా కానీ.. వాళ్లిద్ద‌రే మాట్లాడుకొని సెట్ చేసుకుంటే స‌మ‌స్య ఏమీ ఉండ‌దు. కానీ.. పంచాయితీపెట్టి తీర్పు బాధ్య‌త‌ను వేరేవాళ్ల‌కు అప్ప‌జెప్పిన‌ప్పుడు మొత్తం తేడా వ‌చ్చేస్తుంది. వాళ్లు చెప్పే తీర్పును వీళ్లిద్ద‌రూ త‌లొంచుకొని, చేతులు క‌ట్టుకొని మ‌రీ వినాల్సి వ‌స్తుంది. ఇప్పుడు.. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నీటి పంచాయితీ విష‌యంలో ఇదే జ‌రిగింది. మీది త‌ప్పంటే.. మీదే త‌ప్పు అంటూ.. రెండు రాష్ట్రాలు పంచాయితీ పెట్టుకొని చివ‌ర‌కు సుప్రీం కోర్టుకు సైతం పంచాయితీ చేర‌డంతో.. కేంద్రం స్పందించింది. ఈ వివాద ప‌రిష్కారంలో భాగంగా ఒక గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 14 నుంచి అమల్లోకి రానున్న ఈ గెజిట్ ప్ర‌కారం ఏం జ‌ర‌గ‌నుంది? అస‌లు ఆ గెజిట్ లో ఏముంది? అన్న‌ది చూద్దాం.

1. గెజిట్ ప్ర‌కారం కృష్ణా, గోదావ‌రి బేసిన్లోని రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల‌న్నీ అక్టోబ‌రు 14 నుంచి కృష్ణా, గోదావ‌రి బోర్డుల ప‌రిధిలోకి వెళ్ల‌నున్నాయి. అంటే.. కృష్ణాప‌రివాహ‌క ప్రాంతంలోని 36 ప్రాజెక్టుల‌, గోదావ‌రి ప‌రిధిలోని 71 ప్రాజెక్టులు ఆయా బోర్డుల ఆధీనంలోకి వెళ్తాయి. వీటిపైనున్న విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాలు, స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థను కూడా బోర్డులే నిర్వ‌హిస్తాయి.

2. కృష్ణా బోర్డు, గోదావ‌రి గోదావ‌రి బోర్డు అపెక్స్ కౌన్సిల్ ప‌రిధిలో ప‌నిచేస్తాయి. ఈ రెండు బోర్డుల్లో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారు ఉండ‌రు. బోర్డు స‌భ్యులు, కార్య‌ద‌ర్శులు, చీఫ్ ఇంజ‌నీర్లు ఇత‌రుల‌నే నియ‌మించాలి.

3. ఈ బోర్డుల స్వ‌రూపం ఎలా ఉండాల‌నేది ఆయా బోర్డులే నిర్ణ‌యించుకుంటాయి. గెజిట్ అమల్లోకి వ‌చ్చిన 30 రోజుల్లోగా బోర్డులు నిర్దేశించుకున్న స్వ‌రూపం ప్ర‌కారం, అవి నియ‌మించుకున్న విభాగాల‌కు ఉద్యోగుల‌ను కేంద్రం నియ‌మిస్తుంది.

4. గ‌త అక్టోబ‌రు 6న నిర్వ‌హించిన అపెక్స్ కౌన్సిల్ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యానికి త‌గిన‌ట్టుగా కృష్ణా, గోదావ‌రి బోర్డుల ప‌రిధిని నోటిఫై చేసిన అంశాల‌కు త‌గిన‌ట్టుగా రాష్ట్రాలు న‌డుచుకోవాల్సి ఉంటుంది.

5. ప్రాజెక్టుల భ‌ద్ర‌త‌ను సీఐఎస్ ఎఫ్ బ‌ల‌గాలు నిర్వ‌హిస్తాయి. ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించే అధికారుం బోర్డుల‌కు ఉంటుంది. ప్రాజెక్టుల ప‌రిధిలోని ఉద్యోగులు అంద‌రూ బోర్డు ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ప‌నిచేయాల్సి ఉంటుంది.

6. ఈ ప్రాజెక్టుల‌కు సంబంధించి ఏమైనా కోర్టు కేసులు ఉంటే.. వాటి బాధ్య‌త మాత్రం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌దే. ఈ కేసుల‌తో బోర్డుకు ఎలాంటి సంబంధ‌మూ ఉండ‌దు.

7. ఇక‌, ప్రాజెక్టుల‌కు ప్ర‌కృతి వైప‌రీత్యాల నుంచి ముప్పు వాటిల్లిన‌ప్పుడు వాటి నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను రెండు రాష్ట్రాలూ చేప‌ట్టాల్సి ఉంటుంది. ఇదంతా బోర్డుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే సాగుతుంది.