Polavaram: పోలవరం విషయంలో కేంద్రం సీరియస్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై కేంద్ర జల శక్తి శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నత స్థాయి అధికారుల బృందం హాజరైంది.

Written By: Dharma, Updated On : December 6, 2023 10:17 am

Polavaram

Follow us on

Polavaram: పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చెప్పాలో అని చెప్పింది. ఎందుకన్నా తొందర అంటూ.. పర్సెంటా, అర పర్సెంటా అంటూ ఆ మధ్యన జల వనరుల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ప్రతిపక్షాలపై రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా ఫలానా తేదీకి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తామంటూ ప్రకటనలు కూడా చేశారు. ఆ కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కలుగుజేసుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై కేంద్ర జల శక్తి శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నత స్థాయి అధికారుల బృందం హాజరైంది. అయితే ఈ సమావేశం చాలా సీరియస్ గా జరిగినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అయినట్లు తెలిసింది. 2024 జూన్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్న ఏపీ ప్రభుత్వ అధికారుల మాటలను తప్పు పట్టినట్లు సమాచారం. అది ఆచరణాత్మక ప్రణాళిక కాదు అని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు అంశాలపై ఏపీ అధికారులు సరిగ్గా స్పందించడం లేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువన ఉన్న కాఫర్ డ్యాం కొట్టుకుపోయేలా ఉందని.. అసలు నీళ్లు ఎందుకు నింపుతున్నారని ప్రశ్నించారు. ఎగువ కాపర్ డ్యాం మరమ్మతులకు గురైతే కేంద్రంనిధులు చెల్లించబోదని తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తాము అందించిన సాఫ్ట్వేర్లలో వివరాలు ఎందుకు అప్లోడ్ చేయడం లేదని కేంద్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరో పక్షం రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలని.. గతంలో తాము ప్రాజెక్ట్ అధ్యయనానికి వెళ్ళినప్పుడు ఏపీ అధికారుల తీరు సరిగా లేదని మండిపడినట్లు తెలుస్తోంది. గత నాలుగు సంవత్సరాలుగా సీజన్ల మీద సీజన్లు మారాయి తప్ప ప్రాజెక్టు నిర్మాణం మాత్రం పూర్తి కాలేదని.. అటువంటి అప్పుడు ఆర్భాటపు ప్రకటనలు మానుకోవాలని హితవు పలికినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు అర్థమవుతోంది. దీనిపై జగన్ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.