Gold Mines: బంగారం..ఖరీదైన వస్తువుల్లో ఒకటి. గొప్ప ఆస్తి. దాని విలువ పెరుగుతుందే తప్ప తరగదు. అందుకే బంగారం ధరించే వారికి సమాజంలో ప్రత్యేక హోదా ఉంటుంది. ప్రధానంగా భారతదేశంలో బంగారానికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. పేద, ధనిక అంతరాన్నితెలియజేస్తుంది ఈ స్వర్ణం. ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరిస్తే ధనిక..ఏ ఆభరణం కనిపించని వారికి పేదలుగా ఈ సమాజం లెక్క కడుతుంది. చివరకు ఏ విషయంలోనూ పోల్చాలనుకుంటే బంగారంతోనే పోల్చే గుణం ఒక్క భారతీయులకు ఉంటుందనడంలో అతిశయోక్తి కాదు. బంగారం గురించే ఇంతలా క్రేజ్ ఉంటే బంగారు గణులున్నవారిని ఏమనాలి. ఆ విషయానికి వస్తే 10 బంగారు గనులు ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఏమనాలి? ఏమని వర్ణించాలి? దేశ వ్యాప్తంగా చాలాచోట్ల బంగారు గనులు ఉన్నాయి. వాటని విక్రయించి భారత దేశ స్థూల ఉత్పత్తిలో మైనింగ్ వాటాను పెంచాలన్నది ప్రభుత్వ భావనగా తెలుస్తోంది. అందుకే దేశ వ్యాప్తంగా 13 బంగారు గనులకు భేరం పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం. వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటివరకూ భారతీయ సహజ వనరులుగా ఉన్న వీటిని సంరక్షించాల్సింది పోయి విక్రయానికి దిగుతుండడం విమర్శలకు తావిస్తోంది.
ఆ 10 మనవే..
దేశ వ్యాప్తంగా 13 బంగారు గనులను విక్రయించడానికి కేంద్రం సిద్ధపడింది. అయితే అందులో 10 గనులు ఏపీలోనివే కావడం విశేషం.మరో మూడు గనులు ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. ఏపీకి సంబంధించి రామగిరి నార్త్ బ్లాక్, బొకసంపల్లి నార్త్ బ్లాక్, బొకసంపల్లి సౌత్ బ్లాక్, జవకుల-ఏ, జవకుల -బి, జవకుల -డి, జవకుల -ఒ, జవకుల -ఎఫ్ బ్లాక్ లు ఉన్నాయి. వీటిలో 5 గనులకు ఈనెల 26న, మిగతా ఐదింటికి 29న వేలం నిర్వహించనున్నారు. ఇక యూపీలోని మూడు గనులు ‘సోనా పహాడి బ్లాక్, సోనాభద్రలోని ధ్రువ-బైదానంద్ బ్లాక్ ల అమ్మకానికి వేలం నిర్వహిస్తారు.
Also Read: Poshan Abhiyaan: దేశ ప్రజలకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించే పనిలో ప్రధానమంత్రి మోడీ
ఈ మొత్తం గనులను అమ్మకానికి కేంద్రం సిద్ధపడడం వెనుక అనేక కారణాలున్నాయి. తద్వారా మైనింగ్ ఆదాయ వనరులను పెంచడమే ముఖ్య ఉద్దేశ్యంగా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమ్మకాలకు పూనుకున్నాయి. ఇప్పటికే 199 మినరల్ బాక్స్ లను వేలం వేశాయి.ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం రంగంలోకి దిగింది. బంగారు గనులు విక్రయించి ఆదాయం పెంచుకునే ప్రయత్నంలో పడింది. మొత్తానికైతే దేశంలో అమ్మకాలు అనే కామన్ పాయింట్ను తీసుకొని తన పని కానిచ్చేస్తోంది.
సహజ వనరులపై కన్ను..
దేశంలో అపార సహజ వనరులున్నాయి. శాతాబ్దాలుగా తరగని ఆస్తిగా, వారసత్వ సంపదగా ఉన్నాయి. అటువంటి వాటిపై ప్రభుత్వాలు చేయి పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. రకరకాల కారణాలు చూపుతూ అమ్మకాలు పెడితే భవిష్యత్ లో సహజ వనరులనేవి మిగలవని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా అమ్మకాలు చూపడం సరైన చర్య కాదని అభిప్రాయపడుతున్నారు.ఇలా అమ్ముకుంటే పోతే రేపటి తరం ఏమవుతుంది?దేశం సంగతి ఏంటన్నది ఆలోచించాల్సిన తరుణమిది. ఏది ఏమైనా దేశంలో 13 బంగారు గనులు ప్రైవేటుపరం చేతికి వెళ్లడం దేశ ప్రజలు చింతించాల్సిన విషయం.