Poshan Abhiyaan: అగ్గువకే ఇస్తున్నామనే నిర్లక్ష్యమో, పేదలంటే చులకన భావమో తెలియదు గానీ.. నేటికీ ఆ రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యం నాసిరకం. ఈ దేశం త్వరలో ఐదు లక్షల ట్రిలియన్ డాలర్ల జిడిపికి వెళ్తుందని ఆర్థికవేత్తలు జబ్బలు చరుచుకుంటున్నారు. కానీ నేటికీ ముక్కి, పురుగులు పట్టిన ఆ బియ్యాన్ని తినలేక పోషకాహార లోపంతో బాధపడే పేదలు ఎంతోమంది. మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలోని మారుమూల గ్రామాలు, దక్షిణ భారతంలోని అటవీ ప్రాంత గ్రామాల్లో పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య పది కోట్లకు పైగానే ఉంటుంది. ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాలు ఏర్పాటు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. పైగా ఈ ప్రాంతాల్లో జన్మించిన వారిలో రక్తహీనత కూడా ప్రధాన సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరిలో పోషకాహార లోపాన్ని నివారించి, బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే పోర్టీ ఫైడ్ బియ్యం తయారీకి నడుం బిగించింది.
ఇంతకీ ఈ బియ్యం ఎలా ఉంటాయంటే
పోషకాహార లోపాలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పథకాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా పేదలు బడి పిల్లలు, అంగన్వాడి చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు బలవర్ధక బియ్యం లేదా ఫోర్టీ ఫైడ్ రైస్ ను పంపిణీ చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా, 2023 ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అన్ని జిల్లాల్లో 100% అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 తో కూడిన బియ్యాన్ని సేకరించే పనిలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నిమగ్నమైంది. ప్రధానమంత్రి మోడీ 2019 ఆగస్టు 25 నిర్వహించిన మనకీ బాత్ లో బలవర్ధక బియ్యం పంపిణీ ఆవశ్యకత వివరించారు.
ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆహార భద్రత కార్డులో లబ్ధిదారులుగా ఉన్న పేదలందరికీ ఫోర్టీ ఫైడ్ రైస్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. నిరుడు ఏప్రిల్ నుంచి ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ ప్రారంభించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో భూపాలపల్లి, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలను ఎంపిక చేశారు. అయితే ఈ బియ్యం పంపిణీ కి సంబంధించి తొలుత ఐసీడీఎస్ కోటా, మధ్యాహ్న భోజనం కోటాల కింద అందజేశారు. ఆ తర్వాత ఆహార భద్రత కార్డుదారులకు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేస్తున్నారు. కాగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 53.90 లక్షల కార్డులు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 36.44 లక్షల కార్డులు కలిపి మొత్తం 90.34 లక్షల ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్న 2.86 కోట్ల మందికి కూడా ఈ బియ్యాన్ని పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్వాడీ కేంద్రాలకు ఈ బియ్యాన్ని సరఫరా చేస్తారు. దీంతో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12, ఐరన్ తో కూడిన బలవర్ధకమైన ఆహారం ప్రజలకు అందుతుంది.
కేంద్రం నిర్ణయంతో ఏం జరుగుతుందంటే..
ఈ ఫోర్టీ ఫైడ్ నిర్ణయంతో ఇకమీదట సాధారణ బియ్యానికి ఏ మాత్రం డిమాండ్ ఉండదు. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నందువల్ల రైసుమిల్లర్లు కూడా అప్ గ్రేడ్ కావలసిన అవసరం ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలంటే సిఎంఆర్, ఎఫ్ఆర్కే రూపంలో బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆరు లక్షల టన్నుల ఫోర్టీ ఫైడ్ బియ్యాన్ని భారత ఆహార మండలికి అందజేసింది. భవిష్యత్తులో 100% ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. ఇక వచ్చే ఏప్రిల్ నుంచి ఈ బియ్యమే సరఫరా చేయాల్సి ఉండటంతో అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బహిరంగ విపణిలో భారీగా డిమాండ్ ఏర్పడడంతో ఇప్పుడు మిల్లుల్లో నిలువ ఉన్న సాధారణ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయాలని అనుకుంటున్నారు. ఇటీవల ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య ఏర్పడిన వివాదం వల్ల యాసంగి సీజన్లో సేకరించిన ధాన్యం పలుచోట్ల తడిచిపోయింది. కొన్నిచోట్ల మొలకలు కూడా వచ్చింది. అయితే ఈ ధాన్యాన్ని కూడా సేకరిస్తామని ఎఫ్సిఐ హామీ ఇవ్వడంతో ప్రస్తుతం వాటిని మిల్లుల్లో మర ఆడి స్తున్నారు. త్వరలో ఆ బియ్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకుని కాకినాడ పోర్టు ద్వారా ఇండోనేషియా, బంగ్లాదేశ్, కెన్యా ప్రాంతాలకు ఎగుమతి చేయాలని అధికారులు అనుకుంటున్నారు.