Homeజాతీయ వార్తలుRajinder Gupta: కేసీఆర్ భయం వల్ల మీడియా పట్టించుకోలేదు కానీ.. ఈ వ్యాప్కోస్ పెద్ద అవి"నీటి"...

Rajinder Gupta: కేసీఆర్ భయం వల్ల మీడియా పట్టించుకోలేదు కానీ.. ఈ వ్యాప్కోస్ పెద్ద అవి”నీటి” తిమింగలం

Rajinder Gupta: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవాదుల ప్రాజెక్టు, ఇందిరా సాగర్, తెలంగాణ ఏర్పడిన తర్వాత తుపాకులగూడెం సమ్మక్క సాగర్, సీతారామ ఎత్తిపోతల పథకం, శామీర్ పేట, దండు మల్కాపూర్ లో కొత్త జలాశయాల ఏర్పాటుకు క్షేత్రస్థాయి పరిశోధన, డీపీఆర్ తయారీ వ్యాప్కోస్ అనే సంస్థ చేపట్టింది. ఇప్పుడు ఈ సంస్థ అవినీతి అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నది. అంతేకాదు ఈ సంస్థకు సంబంధించిన రాజీందర్ కుమార్ గుప్తా, గౌరవ్ సింఘాల్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. అంతేకాదు ఎఫ్ఐఆర్లో రాజేందర్ భార్య రీమా సింఘాల్, గౌరవ్ భార్య కోమల్ సింఘాల్ పేర్లను కూడా చేర్చింది. గత కొద్దిరోజుల నుంచి సంస్థ కార్యాలయాలు, వారి ఇళ్లల్లో సోదాలు చేస్తోంది. ఢిల్లీ, గురు గ్రామ్, చండి గడ్, సోనీ పట్, ఘజియాబాద్ లోని 19 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శుక్రవారం నాటికి మొత్తం 38 కోట్లకు పైచిలుకు నగదును సీజ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో 10 కోట్లను చండీగఢ్లోని రాజీందర్ బంధువు ఇంట్లో అధికారులు సీజ్ చేయడం విశేషం. నగదు తో పాటు భారీగా ఆభరణాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆస్తుల పత్రాలను సిబిఐ అధికారులు గుర్తించారు.

వ్యాప్కోస్ ఎండిగా ఉన్నప్పుడు..

వ్యాప్కోస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా రాజీందర్ ఉన్న సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు. ఆ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఢిల్లీలో ఓ బిజినెస్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. ఢిల్లీలో ఓ బిజినెస్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా రాజీందర్ భారీగా ఆస్తులు కూడపెట్టాడు. ఢిల్లీ, గురు గ్రామ్, పంచకుల, సోనీ పట్, చండీగఢ్ ప్రాంతాలలో భారీగా ఆస్తులు కూడబెట్టాడు.. వాస్తవానికి వ్యాప్కోస్ నీటిపారుదల, జల విద్యుత్ ప్రాజెక్టుల డి పి ఆర్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. రాజీందర్ హయాంలోనే తెలుగు రాష్ట్రాల్లో పలు నీటిపారుదల ప్రాజెక్టులకు డిపిఆర్లు అందజేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు పుష్కలంగా నీటి వసతి ఉందని ఇదే వ్యాప్కోస్.. తెలంగాణ ఏర్పాటు తర్వాత నీటి లభ్యత లేదని చెప్పడం విశేషం.

కాలేశ్వరంలో కీలక పాత్ర

కాళేశ్వరం లో వ్యాప్కోస్ కీలక పాత్ర పోషించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డి పి ఆర్ ను ఈ సంస్థ తయారు చేసింది. ప్రాణహిత చేవెళ్ల కు బదులుగా తెరపైకి వచ్చిన వార్దా డీపీఆర్ లోనూ వ్యాప్కోస్ కీలకపాత్ర పోషించింది. అయితే అప్పట్లో వ్యాప్కోస్ ఎండి పలుమార్లు తెలంగాణకు వచ్చారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును కలిశారు.. అయితే అత్యంత తక్కువ కాలంలోనే ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు తీసుకురావడం అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోలేదు.

అక్రమాలు అందువల్లే

వాస్తవానికి ఒక ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ తయారీకి భారీ కసరత్తు చేయాలి. క్షేత్రస్థాయిలో సర్వే మొదలుపెట్టి మట్టిలో నాణ్యత, లైడార్, డ్రోన్ సర్వేలు చేశాకే డిపిఆర్ కు ఇన్ పుట్స్ సిద్ధమవుతాయి. అయితే పేరుకే వ్యాప్కోస్ అయినప్పటికీ.. ఈ పనులు మొత్తం చేసేది ఔట్ సోర్సింగే. ఇక్కడే అక్రమాలకు, అమ్యామ్యాలకు తెర తీస్తున్నారని తెలుస్తోంది..ఔట్ సోర్సింగ్ కు సంబంధించి పనులు ఎవరికి అప్పగించాలని దానిపై నిబంధనలు లేవు.. వ్యాప్కోస్ లో ఉన్నత స్థాయిలో ఉన్న వారు చెప్పిన సంస్థకు ఆ పనులను అప్పగిస్తారు. ఆ ఔట్ సోర్సింగ్ సంస్థలు భారీగా కమీషన్ లు ముట్ట చెబుతాయని తెలుస్తోంది..

ఆదాయానికి మించి ఆస్తులు

ప్రస్తుతం రాజీందర్ విషయంలోనూ ఔట్ సోర్సింగ్ ద్వారానే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది.. వ్యాప్కోస్ కు కోట్ల రూపాయలు కట్టపెట్టి సిద్ధం చేసుకునే డీపీ ఆర్ లు తలకిందులుగా, అడ్డదిడ్డంగా ఉంటాయని, సమగ్రంగా అసలు ఉండవని విశ్రాంత ఇంజనీర్లు చెబుతున్నారు. వ్యాప్కోస్ ఇచ్చిన డిపిఆర్ లకు ఇవ్వాలంటే స్థానిక ఇంజనీర్లు అష్ట కష్టాలు పడాల్సిందేనని చెబుతున్నారు. తాజాగా వార్ధా డిపిఆర్ విషయంలోనూ వ్యాప్కోస్ డొల్లదనం బయటపడింది. ఇంజనీర్లు లోపాలు ఎత్తి చూపినప్పటికీ, పి ఆర్ కవర్ చేయడంలో వ్యాప్కోస్ విఫలమైంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడం, డి పి ఆర్ ఆ సంస్థ సిద్ధం చేసిందంటే కేంద్రం సాయం, బ్యాంకు రుణాల విషయంలో ఇబ్బందులు ఉండవని ఒకే ఒక్క కారణంగా వ్యాప్కోస్ కు బాధలు అప్పగిస్తున్నాయి. అయితే కోట్ల రూపాయల ఫీజును కన్సల్టెన్సీ రూపంలో వసూలు చేస్తే వ్యాప్కోస్ ప్రతికూలతలను చెబుతుందా? ప్రాజెక్టులో లోపాలతో జరిగే నష్టాన్ని అంచనా వేస్తుందా? అంటే ఈ ప్రశ్నలకు ఇంజనీర్లు నో అనే సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే టర్మ్ అండ్ రెఫరెన్స్ కు అనుగుణంగానే వ్యాప్కోస్ డిపిఆర్లు సిద్ధమవుతాయని చెబుతున్నారు. అంటే ఈ లెక్కన ప్రభుత్వాలు నచ్చినట్టు నివేదిక ఇస్తుందని వివరిస్తున్నారు. దీనిని బట్టి ప్రాజెక్టుల్లో లోపాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఓకే చేస్తుంది అంటే అందులో ఎటువంటి అవకతవకలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సంస్థకు సంబంధించి అక్రమాలు బయటపడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో దీని గురించి మీడియాలో కథనాలు రాకపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ అంటే భయమే అని తెలుస్తోంది. అందువల్లే ఇంత జరుగుతున్నప్పటికీ మీడియా గుంభనంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular