
Srikakulam Politics- MLC Elections: సిక్కోలు అధికార వైసీపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కుల చిచ్చును రగిలించేలా ఉన్నాయి. జిల్లాలో తూర్పుకాపులు, కాళింగులు, వెలమ ప్రధాన సామాజికవర్గాలు. కాళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్ గాను, మంత్రులుగా వెలమ సామాజికవర్గానికి చెందిన ధర్మానప్రసాదరావు, మత్స్యకార వర్గానికి చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజు ఉన్నారు. కానీ మెజార్టీ సామాజికవర్గంగా ఉన్న తూర్పుకాపులకు మాత్రం ఎటువంటి ప్రాధాన్యం లేదు. పొరుగున ఉన్నవిజయనగరం సమీకరణలు లెక్కకట్టి శ్రీకాకుళంలో మాత్రం తూర్పుకాపులకు కనీస ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారన్న అపవాదు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తూర్పుకాపులకు కేటాయిస్తారని భావించారు. కానీ అందుకు విరుద్ధంగా యాదవ సామాజికవర్గానికి చెందిన నర్తు రామారావును పార్టీ హైకమాండ్ క్యాండిడేట్ గా నిర్థారించింది. దీంతో తూర్పుకాపులు రుసరుసలాడారు. వైసీపీ హైకమాండ్ తీరును నిరసిస్తూ తూర్పుకాపు తరపున బూర్జ మాజీ జడ్పీటీసీ అనెపు రామక్రిష్ణను బరిలో దించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. నర్తు రామారావు వైసీపీ అభ్యర్థిగాను, అనెపు రామక్రిష్ణతో పాటు మరొకరు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. కానీ ఒకరి నామినేషన్ స్క్రూట్నీలో తిరస్కరణకు గురైంది. నర్తు రామారావుతో పాటు అనెపు రామక్రిష్ణ నామినేషన్లు ఖరారయ్యాయి. అయితే రామక్రిష్ణతో ఎలాగైనా నామినేషన్లు విత్ డ్రా చేయించుకోవచ్చని అధికార వైసీపీ నేతలు భావించారు. కానీ రామక్రిష్ణ విత్ డ్రాకు పెద్దగా మొగ్గుచూపలేదు. దీంతో వైసీపీ హైకమాండ్ పార్టీలోని తూర్పుకాపు నేతలకు రామక్రిష్ణ చే నామినేషన్ విత్ డ్రా చేయించే బాధ్యతను అప్పగించింది. వారు రామక్రిష్ణను అన్నివిధాలా బుజ్జగించినా ఆయన వినలేదు. ఈ నెల 27తో నామినేషన్ గడువు ముగిసింది. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అనివార్యంగా మారింది. ఏకగ్రీవం చేద్దామనుకున్న వైసీపీ నేతల ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
అయితే రామక్రిష్ణ బరిలో ఉండడానికి ప్రధాన కారణం తూర్పుకాపు సామాజికవర్గం నినాదమే. జిల్లాలో మెజార్టీ సామాజికవర్గంగా ఉన్న ఒక్క డీసీసీబీ తప్పించి ఇతర నామినేటెడ్ పోస్టులు దక్కలేదు. జిల్లా పరిషత్ చైర్మన్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, డీసీసీబీ చైర్మన్ వంటి పోస్టులు తూర్పుకాపులకు కేటాయించేవారు. కానీ రానురాను పరిస్థితి మారింది. కాపులకు కనీస ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు. ఇది వైసీపీలోని తూర్పుకాపులకే రుచించడం లేదు. దీంతో తూర్పుకాపు సంక్షేమ సంఘం రంగంలోకి దిగింది. అనెపు రామక్రిష్ణతో నామినేషన్ వేయిండమే కాకుండా పోటీలో ఉండేలా చూసుకుంది. దీంతో అధికార వైసీపీలో కలవరం ప్రారంభమైంది. అత్యవసర సమావేశం నిర్వహించి నియోజకవర్గాల వారీగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయడానికి నిర్ణయించింది.

జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 729. అందులో తూర్పుకాపు సామాజికవర్గానికి 196 ఓట్లు ఉన్నాయి. కాళింగ సామాజికవర్గానికి చెందినవి 106, వెలమ సామాజికవర్గానికి 93 ఓట్లు ఉన్నాయి. యాదవ సామాజికవర్గ ఓట్లు కేవలం 44 మాత్రమే. ఈ గణాంకాలే అధికార పార్టీలో కలవరం రేపుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున స్థానిక సంస్థల ఎన్నికల్లో తూర్పుకాపు సామాజికవర్గానికి కాదని వేరే వారికి ఎమ్మెల్సీ స్థానమిచ్చారు. దీంతో తూర్పుకాపులంతా సంఘటితమయ్యారు. పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ అభ్యర్థి గొర్లె హరిబాబునాయుడుకు మద్దతు తెలిపారు. ఎమ్మెల్సీగా గెలిపించారు. అప్పుడు అదో సంచలనం. ఇప్పుడు కూడా అటువంటిదే రిపీట్ అవుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.