
MP Asaduddin Owaisi Relative: డబ్బు, ఆస్తి, అంతస్థు.. ఇవే మనిషిని నడిపిస్తున్నాయి. సామాన్యులనే కాదు ఆగర్బ శ్రీమంతులనూ ఇవే నిర్దేశిస్తున్నాయి. ఇందుకు ఎవరూ అతీతం కాదు. ఇలాంటి ఆస్తి విషయాల వల్లే మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడు, ప్రముఖ వైద్యుడు మజ్హర్ అలీ ఖాన్(60) రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మజ్హర్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. చాలా కాలంగా ఒవైసీ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగం హెచ్‌వోడీగా వ్యవహరిస్తున్నాడు. ఆయన కుమారుడు డాక్టర్ అబిల్ అలీఖాన్ 2020లో అసద్ కుమర్తెను వివాహం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో మజ్హర్ గదిలోంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. కుటుంబ సభ్యులు పరుగెత్తుకెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆయన చేతిలో రివాల్వర్ ఉంది. వెంటనే ఆయన్ను అంబులెన్స్‌లో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్క రౌండ్ కాల్పులు జరిగినట్టు క్లూస్ టీం ఆధారాలు సంపాదించింది.
ఆస్తి వివాదాలు
డాక్టర్ మజ్హర్ ఆత్మహత్యకు కుటుంబ, ఆస్తి వివాదాలు కారణమని భావిస్తున్నారు. ఆయనపై గతంలో గృహహింస కేసు కూడా నమోదు అయింది. డాక్టర్ మజ్హర్ సియాసత్ దినపత్రిక ఎడిటర్ జాహీద్ అలీ ఖాన్‌కు సోదరుడు. మజ్హర్‌కు వారసత్వంగానే కాకుండా అత్తమామల తరఫు నుంచి కూడా భారీగా ఆస్తిపాస్తులు (రూ.300కోట్లు) దక్కాయి. ఆయన మామ డాక్టర్ రషీద్ దిగవంత ఒమాన్ రాజు సుల్తాన్ ఖబూ్‌సకు వ్యక్తిగత వైద్యుడిగా, సలహాదారుడిగా నాలుగు దశాబ్దాలకుపైగా పనిచేశారు. ప్రపంచంలోకెల్లా సుదీర్ఘ కాలం (50 ఏళ్లకు పైగా) తాను మరణించే వరకు ఒమాన్‌ను ఏలిన ఖబూ్‌సకు అత్యంత విశ్వసనీయ వ్యక్తుల్లో హైదరాబాద్‌కు చెందిన రషీద్ ఒకరు. రషీద్‌కు రాజు అనేక నజరానాలు ఇచ్చేవారు.

మూడేళ్ళుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు
1993లో రషీద్ తన కుమార్తె ఆఫియాను మజ్హర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆఫియా పుట్టినప్పటి నుంచి పెళ్లయ్యే వరకు ఒమాన్ రాజధాని మస్కట్‌లోనే తల్లిదండ్రుల వద్ద ఉన్నారు. రషీద్ సంతానమంతా అమెరికాలో స్ధిరపడగా ఆఫియా మాత్రమే హైదరాబాద్‌లో ఉంటున్నారు. మాతృభూమిపై మమకారం, చిన్నకూతురిపై అనురాగంతో రషీద్ అమెకు హైదారాబాద్‌లో అనేక ఆస్తులు బహూకరించారు. అల్లుడికి కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫాం హౌసులు ఇచ్చారు. మూడేళ్ళుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి ఆస్తిపాస్తులపై వివాదం ఏర్పడింది. ఆఫియా తన తండ్రి తనకిచ్చిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేశానంటూ కోర్టుకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో డాక్టర్ మజ్హర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై విదేశాల్లో నివసిస్తున్న హైదరాబాదీలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాగా, గతంలో జరిగిన ఓ దాడిలో అక్బరుద్దీన్ ఓవైసీ గాయపడగా ఆయనకు చికిత్స అందించిన వైద్య బృందంలో మజ్హర్ ఒకరు.