TTD: దేవదేవుడు.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మల పుణ్యం వస్తుందని అంటుంటారు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయంగా తిరుమల చరిత్రలో నిలిచింది. కరోనాకు ముందు నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామివారిని రోజులతరబడి క్యూలో ఉండి దర్శించుకునేవారు. తరువాత కోవిడ్ ఎఫెక్టుతో రద్దీతగ్గింది. నిబంధనలు పెరిగాయి. కొన్నాళ్ల పాటు కేవలం రూ.300 టికెట్ దర్శనాలకే అవకాశం ఇచ్చిన టీటీడీ తరువాత సర్వదర్శనం కూడా నిబంధనల ప్రకారం.. ప్రారంభించింది. ప్రస్తుతం కోవిడ్ పరీక్షతో పాటు రెండు డోసుల టీకా సర్టిఫికెట్ ను తప్పనిసరి చేసిన టీటీడీ.. ఇప్పుడు మరో ముందడుగు వేసింది… వెంకన్న దర్శనానికి కులం సర్టిఫికెట్ ను కూడా తీసుకురావాలని టీటీడీ పాలక మండలి యోచిస్తోంది. త్వరలో ప్రారంభం అయ్యే శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఈ పద్థతిని ప్రవేశ పెడితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తోంది..

శ్రీవారి దర్శనం మహా భాగ్యంగా చాలా మంది భావిస్తుంటారు. స్వామివారి చెంతన అందరూ సమానమేనని అంటారు. కానీ ఆయన భక్తుల్లో చాలా రకాలుగా ఉంటారు. డబ్బు ఉన్నవారు కొందరైతే.. ఏం లేని పేదలు మరికొందరు.. ఇలా వందలాది రకాల మంది స్వామివారి దర్శనానికి వస్తుంటారు. అయితే త్వరలో మరో రకానికి చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని పాలకవర్గం కల్పించేలా యోచిస్తోంది. వెనకబడిన వర్గాల పేరిట కొత్తరకం దర్శనాలను తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ.
వెనకబడిన వర్గం ఏంది..? దర్శనాల కథ ఏంటని అనుకుంటున్నారా.? మరేం లేదండి.. తిరుమల తిరుపతి దేవస్థానం వారు వెనకబడిన వర్గాలకు చెందిన వారిలో రోజుకు వెయ్యి మందిని స్వామివారి దర్శనానికి ప్రత్యేక అవకాశం కల్పిస్తారంట. అయితే ఈ అవకాశం కూడా అన్ని రోజులు కాదు.. కేవలం బ్రహ్మోత్సవాల సమయంలోనే. ఇంతకీ వెనకబడిన వర్గాలు అంటే ఏమిటి? అందులో ఎవరెవరూ ఉంటారనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు టీటీడీ. కులాల లెక్కల ప్రకారం అయితే.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇలాంటి అవకాశం ఇస్తారని అనుకోవాలి. అదే నిజం అయితే.. కులాల ప్రకారం.. భక్తులను విభజించిన రికార్డును టీటీడీ సొంతం చేసుకుని చరిత్రకు ఎక్కుతుంది.
ఇప్పటి వరకు తిరుమల స్వామివారి దర్శనానికి రావాలంటే.. కేవలం హిందువులు అయితే చాలు.. మిగితా అన్యమతస్తులు వస్తే.. తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. హిందువుల్లో ఏ కులం నుంచి వస్తున్నారు.. ఎవరెవరికి ఏ కోటాలో దర్శనాలు కల్పించాలనే అంశాన్ని ఇతవరకు టీటీడీ తెరపైకి తీసుకురాలేదు. అయితే కొత్తగా… ప్రయోగాలు చేస్తున్న పాలక మండలి.. ఈ కుల మంత్రాన్ని దేవుడిపై రుద్దుతోంది. నిజానికి స్వామివారి దర్శనం అనేది పేద ప్రజలకు చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. మధ్య తరగతి ప్రజలు కనీసం ఏడాదిలో ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకుంటారు. పేదవారు కుటుంబ సమేతంగా వెళ్లాలంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారికి టీటీడీ సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. కుల రాజకీయం సరైంది కాదని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేవుడితో కులాలపేరిట ఆడుకోవడం సరైందని కాదని కొందరు భక్తులు అంటున్నారు. దేవుడి సన్నిధిలో అందరూ సమానమేనని.. ఓటు బ్యాంకు పథకాల కోసం వేరుగా చూడడం ఎందని అడుగుతున్నారు. అయితే ఇలాంటి ప్రయోగాలు ప్రస్తుత అధికార పార్టీ యే కాదు.. గత ప్రభుత్వాలు కూడా చాలానే చేశాయి. గత ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పథకాన్నే ప్రవేశపెట్టింది. జిల్లాల నుంచి భక్తులను ఉచితంగా తీసుకెళ్లి శ్రీవారి దర్శనం చేయించింది. ప్రసాదాలు ఇప్పించి మరీ ఇళ్లలో దింపే కార్యక్రమం సైతం చేపట్టింది. అయితే అక్కడ వెనకబడిన వర్గాలు.. ఇతర వర్గాలు అనే వేరుబంధం చూడలేదు. దర్శనం చేసుకోలేని కొందరిని ఎంపిక చేసి.. అవకాశం కల్పించింది. తరువాత వచ్చిన ప్రభుత్వం పథకాన్ని రద్దు చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఓటు బ్యాంకు కోసం బ్రహ్మోత్సవాల సమయంలో.. ‘‘వెనుకబడిన వర్గాల’’ వారికోసం కొత్త పథకాలు ప్రారంభిస్తోంది. చూడాలి మరి ఇదీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో..???