రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి కోర్టుల్లో ఎదురుదెబ్బలు తప్పడం లేదు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్ ఇచ్చింది. కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ద్వారకాతిరుమల పోలీసులు ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద ఎమ్మెల్యేతో పాటు మరో 12 మందిపై కేసు నమోదు చేశారు.
Also Read : కేంద్రంలో వియ్యం.. రాష్ట్రంలో కయ్యం..
ద్వారకా తిరుమల మండలం మాలసానికుంటకు చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ 2017 సంవత్సరం డిసెంబర్ నెలలో తలారి వెంకట్రావు, మరి కొంతమంది వ్యక్తులు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. అయితే తలారి వెంకట్రావు స్థానికంగా పలుకుబడి ఉన్న నేత కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆదిలక్ష్మి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది.
తన ఇంటిపై దాడి జరిగినా పోలీసులు పట్టించుకోలేదని ఆదిలక్ష్మి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పొందుపరిచింది. అయితే కోర్టు ఆదేశాల గురించి ఎమ్మెల్యే ఇప్పటివరకు స్పందించలేదు. పోలీసుల దర్యాప్తులో మహిళ ఆరోపణలు నిజమేనని తేలితే ఎమ్మెల్యే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాలు వైసీపీ ఎమ్మెల్యేతో పాటు అధికార పార్టీకి కూడా ఒకింత షాక్ అనే చెప్పాలి.
కొన్ని రోజుల క్రితం సీఎం జగన్ కు గుడి కట్టిస్తానంటూ గోపాలపురం మండలం రాజపాలెంలో జగన్ మందిరానికి శంఖుస్థాపన చేసి తలారి వెంకట్రావు వార్తల్లో నిలిచారు. ప్రజలకు ఎంతో మేలు చేసిన జగన్ కు గుడి కట్టడంలో తప్పేం లేదని ఆయన అన్నారు. వారం రోజుల క్రితం కరోనా నిర్ధారణ కావడంతో ఆయన మరోమారు వార్తల్లో నిలిచారు. ఆయన భార్యకు కూడా కరోనా నిర్ధారణ కాగా ఏలూరులోని కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గోరుచుట్టుపై రోకలిపోటులా కరోనాతో బాధ పడుతున్న ఎమ్మెల్యేను హైకోర్టు ఆదేశాలు టెన్షన్ పెడుతున్నాయి.
Also Read : సీఐని బెదిరించిన వైసీపీ ఎమ్మెల్యే.. ఫోన్ సంభాషణ లీక్?