తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ పై ఓ జ్యోతిష్యుడు కేసు పెట్టాడు. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో.. తన యూట్యూబ్ ఛానల్ లో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అసలు వివాదం ఏమంటే..?
హైదరాబాద్ లోని మధురానగర్ కాలనీలో ‘మారుతి సేవా సమితి పేరిట’ ఓ జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్నాడు. అయితే.. ఇటీవల ‘లక్ష్మీకాంత శర్మ బాధితులు’ పేరుతో తీన్మార్ మల్లన్న యూట్యూబ్ ఛానల్ లో పలు కథనాలు ప్రసారం చేశాడు. ఆ ఎపిసోడ్ లలో కొందరు లక్ష్మీకాంత శర్మపై ఫిర్యాదులు చేశారు. తాయెత్తులు, లాకెట్ల పేరుతో తమ నుంచి డబ్బులు మొత్తం గుంజాడని, కానీ.. వాటి వల్ల ఫలితం ఏమీ రాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సదర్భంగా తీన్మార్ మల్లన్న లక్ష్మీకాంత శర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పెద్ద దొంగ అని, జ్యోతిష్యం పేరుతో జనాలను దోచుకుంటున్నాడని ఆరోపించారు. అంతేకాదు.. అతని వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారని, అతని సంపాదనలో వారితోపాటు పోలీసులకు, మీడియాకు కూడా వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. శర్మ చిట్టా మొత్తం తన వద్ద ఉందని చెప్పారు మల్లన్న.
అయితే.. ఈ వివరాలు వెల్లడిస్తున్నందుకు తనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పారు మల్లన్న. ఇందుకు సాక్ష్‌యంగా పలు వాయిస్ రికార్డులు కూడా వినిపించారు. అవతలి వ్యక్తి మీ ఎక్స్ పెక్టేషన్ ఏంటని అడగ్గా.. లంచంతో మమ్మల్ని కొంటారా? అని మల్లన్న ప్రశ్నించారు. కూర్చొని మాట్లాడుకుందామని సదరు వ్యక్తి చెప్పగా.. నిందితుడిని అరెస్టు చేసే వరకు వదిలేది లేదని మల్లన్న వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలోనే.. మల్లన్నపై కేసు నమోదు కావడం గమనార్హం. ఈ నెల 22వ తేదీన కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మరి, రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.