Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్( AP Minister Nara Lokesh ) ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం హోరెత్తుతోంది. ఉగాది నాటికి సంచలనం నమోదు కాబోతుందని ఒక అంచనా ఉంది. నారా లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారని ప్రచారం నడుస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఈ ప్రచారం పతాక స్థాయికి చేరింది. అదిగో నారా లోకేష్ సీఎం పదవి అంటూ ఎక్కువ మంది విశ్లేషించడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో అయితే అదే పనిగా ప్రచారం జరుగుతోంది. అయితే ఒకటి మాత్రం నిజం గతం కంటే లోకేష్ ప్రభావం పెరిగింది. జాతీయస్థాయిలో యువ నాయకుడిగా లోకేష్ గుర్తింపబడుతున్నారు. ఢిల్లీ మీడియాలో సైతం తరచూ కనిపిస్తున్నారు. నేషనల్ మీడియాకు ఆయన ఒక ముఖ్య అతిథిగా మారిపోయారు. దేశంలో ఎక్కడ కాంక్లేవులు జరిగినా లోకేష్ కు ఆహ్వానాలు అందుతున్నాయి. అంతలా పెరిగింది ఆయన మేనియా.
Also Read: ప్రాధేయపతూనే గాంభీర్యం.. ఎందుకు ట్రంపూ ఇంత బలుపు?
* ఇటీవల పరిణామాలతో..
చంద్రబాబు( CM Chandrababu) ఢిల్లీ రాజకీయాలకు వెళ్తారని ప్రచారం జరగడానికి ప్రధాన కారణం నితీష్ కుమార్. ఆయన ఉన్నఫలంగా తన పదవిని వదిలి ఢిల్లీ రాజకీయాలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. బీహార్ సీఎం పదవి వదిలి కేంద్ర మంత్రి పదవి అందుకుంటానని సంకేతాలు ఇచ్చారు. బహుశా ఈ కారణంతోను చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలకు వెళ్తారన్న ప్రచారం మొదలైంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ తర్వాత నితీష్ పార్టీ కీలక భాగస్వామి. పైగా నితీష్ కుమార్ చంద్రబాబుకు సమకాలీకుడు. అందుకే నితీష్ ప్రకటనతో చంద్రబాబుపై ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టుగానే కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొన్ననే రెండు గంటల పాటు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు చంద్రబాబు. ఇదంతా చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడం, లోకేష్ ను సీఎం చేయడం కోసమే నన్న టాక్ నడిచింది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.
* ఇప్పుడిప్పుడే మమేకం..
అయితే లోకేష్ సీఎం అయ్యేందుకు అనుకూల వాతావరణం ఉందా అనేది ఒక ప్రశ్న. తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) వరకు ఓకే. ఆ పార్టీని ఇప్పుడు అంతర్గతంగా నడుపుతోంది లోకేష్. ప్రభుత్వంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు కంటే ఇప్పుడు లోకేష్ పార్టీలో పట్టు సాధిస్తున్నారు. ఇటీవల లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు జరుపుతున్నారు. ఒక్క టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలతోనే కాదు.. కూటమి పార్టీలోని ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలతో వరుసగా విందు భేటీలు నిర్వహిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్నారు. ఇది ముమ్మాటికి వారితో మమేకం అయ్యేందుకే. అయితే ఇప్పటికిప్పుడు లోకేష్ సీఎం పదవి తీసుకుంటారు అనేది మాత్రం అవాస్తవం. కానీ లోకేష్ ను సీఎంగా ప్రమోట్ చేసే పనిలో టిడిపి శ్రేణులు ఉన్నాయి.
* పవన్ పని చేయగలరా?
మరోవైపు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) పరిస్థితి ఏంటనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఎందుకంటే సీనియారిటీ, ఈ రాష్ట్ర అభివృద్ధి వంటి విషయాల లో చంద్రబాబు నాయకత్వం పట్ల పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక గౌరవం ఉంది. చంద్రబాబు కింద పని చేసేందుకు ఎంత మాత్రం సంకోచం లేదు. కానీ తనకంటే చిన్న వయసు ఉన్న లోకేష్ కింద పని చేయాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ కు కాస్త ఇబ్బంది. తెలుగుదేశం పార్టీలో లోకేష్ కు ఓకే. కానీ ఆయన ఇమేజ్ తో 2029 ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ లేదు. చంద్రబాబు ఇమేజ్ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి అవసరం. నారా లోకేష్ పార్టీకి కీలకమే కావచ్చు కానీ.. కేవలం ఆయన ఇమేజ్తో ఎన్నికలకు వెళ్లడం అనేది ఆ పార్టీకి ఇబ్బందికరమే. అందుకే 2029 ఎన్నికల తరువాత లోకేష్ నాయకత్వంపై పార్టీ శ్రేణులకు, కూటమికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చే అవకాశం ఉంది.
* రాష్ట్ర రాజకీయాలే ఊపిరి..
చంద్రబాబు రాజకీయాలను ఊపిరిగా భావిస్తున్నారు. తన శరీరంలో శక్తి ఉన్నంతవరకు ఆయన ఈ రాష్ట్రాన్ని విడిచి పెట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయనకు చేతినిండా పని ఉండాలి. గతంలో కూడా చంద్రబాబు భారత ఉపరాష్ట్రపతిగా పదవి చేపడతారని ఒక ప్రచారం నడిచింది. ఇప్పుడు ఉప ప్రధాని అంటూ కొత్త ప్రచారం మొదలైంది. అయితే 16 మంది ఎంపీలు ఉన్న తెలుగుదేశం పార్టీకి అత్యున్నత ఉప ప్రధాని పదవి విడిచి పెట్టేందుకు బిజెపి ఇష్టపడదు. చంద్రబాబు మాదిరిగానే తమిళనాడులో రాజకీయాలు చేశారు కరుణానిధి. ఆయన సైతం తన కుమారుడు స్టాలిన్ కు 56 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అయినా సరే కరుణానిధి మాత్రమే డీఎంకే అధ్యక్షుడిగా కొనసాగారు. అటువంటి పరిస్థితి చంద్రబాబు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. కేవలం ఏపీ రాజకీయాల వైపు మాత్రమే ఆయన ఉంటారు. ఇదంతా ఉత్త ప్రచారం అని విశ్లేషకులు తేల్చేస్తున్నారు.