Kodali Nani- Vallabhaneni Vamsi: కొడాలి నాని, వల్లభనేని వంశీ రూటు మార్చారా? ఇన్నాళ్లూ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న వీరు కృష్ణా జిల్లా పార్టీ సమీక్షకు ఎందుకు డుమ్మా కొట్టారు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో వీరు హర్ట్ అయ్యారా? లేక గన్నవరం నియోజకవర్గం విషయంలో అధిష్టానం నాన్చుడు ధోరణికి అకలబూనారా? ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. బుధవారం జరిగిన కృష్ణా జిల్లా వైసీపీ సమన్వయ సమావేశానికి వీరిద్దరూ దూరంగా ఉన్నారు. లోకల్ గానే ఉన్నా వీరు సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. టీడీపీ నుంచి గెలిచిన తన స్నేహితుడు వల్లభనేని వంశీమోహన్ ను వైసీపీలోకి రప్పించారు కొడాలి నాని. ఆ సమయంలో గన్నవరం టిక్కెట్ భరోసాకూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు నియోజకవర్గంలో పాత నేతలు వల్లభనేని రాకను వ్యతిరేకిస్తున్నారు. అయితే వారంతా రెడ్డి సామాజికవర్గం వారు కావడం, అధిష్టాన పెద్దల అనుగ్రహం ఉందన్న టాక్ నడుస్తోంది. ఈ విషయంలో వంశీ తెగ బాధపడుతున్నారుట. తన స్నేహితుడు నానికి గోడు వెళ్లబోసుకున్నారుట. దీంతో ఇద్దరూ కీలక సమావేశానికి గైర్హాజరైనట్టు తెలుస్తోంది. వంశీ ఒక్కరే గైర్హాజరైతే తప్పుడు సంకేతాలు వెళతాయని తెలిసి.. స్నేహితులిద్దరూ కూడబలుక్కొని డుమ్మా కొట్టారు. అధిష్టానానికి హెచ్చరిక సంకేతాలు పంపారు.
తెలుగుదేశం పార్టీకి కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ కొరకరాని కొయ్యలుగా తయారయ్యారు.చంద్రబాబుతో విభేదించి కొడాలి నాని వైసీపీలో చేరారు. జగన్ కు అత్యంత విధేయుడిగా మారారు. పార్టీ ఆవిర్భావం నుంచి అధినేతకు అండగా నిలుస్తున్నారు. జగన్ కూడా చంద్రబాబు, కమ్మ సామాజికవర్గంపై అక్కసు తీర్చుకోవాలన్న ప్రతీసారి కొడాలి నానిని ప్రయోగిస్తుంటారు. శాసన సభ నుంచి చివరికి గ్రామస్థాయి మీటింగులో సైతం కొడాలి నాని చంద్రబాబుతో పాటు లోకేష్ ను తూలనాడుతూ వస్తుంటారు. ఒకానొక దశలో అమరావతిని కమ్మరావతి అని కూడా నాని అభివర్ణించారు. సొంత కులంనే ఆడిపోసుకున్నారు. మంత్రిగా మారిన తరువాత చంద్రబాబు కుటుంబాన్నే టార్గెట్ చేస్తూ వచ్చారు. తీవ్ర మనస్తాపంతో చంద్రబాబు కన్నీరుమున్నీరైనా విడిచిపెట్టలేదు. దీంతో కొడాలి నాని అంటే కమ్మ సామాజికవర్గం వారికి ఒక రకమైన ఏహ్యభావం కలిగింది. కొడాలి నానిని పూర్తిగా బాయ్ కాట్ చేయడం ప్రారంభించారు. అయినా నాని వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ అదే దూకుడుతో విమర్శలు చేస్తూ వస్తున్నారు.
గత ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన వల్లభనేని వంశీమోహన్ పార్టీకి దూరంగా ఉన్నారు. వైసీపీకి, సీఎం జగన్ కు సన్నిహితంగా మెలుగుతున్నారు. అప్పటి నుంచి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. గన్నవరం టిక్కెట్ హామీతోనే ఆయన టీడీపీకి దూరమయ్యారు. వాస్తవానికి గన్నవరంలో టీడీపీ సంస్థాగత బలం అధికం. అందుకే గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో కూడా వంశీ గెలుపొందారు. అటువంటి టీడీపీని వదిలిపెట్టి వస్తే ఇదా బహుమానం అంటూ వంశీ తెగ బాధపడుతున్నారు. ఒకానొక దశలో ఆయన టీడీపీతోకి తిరిగి వెళతారని టాక్ నడిచింది. కానీ ఇప్పటికే స్థాయికి మించి టీడీపీ అధినేతను వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపొందినా ఫస్ట్ టార్గెట్ అయ్యేది కొడాలి నాని కాగా.. రెండో వ్యక్తి వల్లభనేని వంశీయే. అయితే ఈ పరిస్థితుల్లో వైసీపీ టిక్కెట్ ఇవ్వకుంటే పరిస్థితి ఏమిటన్నది వంశీలో టెన్షన్ పెంచడానికి కారణం.
ఏపీలో కుల రాజకీయాలు నడిచినట్టు ఏ రాష్ట్రంలోనూ ఉండవు. ప్రధానంగా కమ్మ, రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఈనాటిది కాదు. తొలి రోజుల్లో కమ్మలు కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలకంగా ఉండగా.. రెడ్డి సామాజికవర్గం వారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేసేవారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత కమ్మలు టీడీపీ గొడుగు కిందకు చేరారు. తమ సొంత పార్టీగా ఓన్ చేసుకున్నారు. అయితే మధ్యలో ఎన్టీఆర్, తరువాత చంద్రబాబు నాయకత్వంతో విభేదించిన వారు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. అయితే వైసీపీ ఆవిర్భవించిన తొలినాళ్లలో మాత్రం రెడ్డి సామాజికవర్గం వారు తమ పార్టీగా చూడడం ప్రారంభించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత వారి భ్రమలు తొలగిపోతున్నాయి. రెడ్డి సామాజికవర్గంలో ఒకరిద్దరికి తప్ప..మిగతా వారికి ఎటువంటి ప్రయోజనం లేదని వారు వాపోతున్నారు. అదే సమయంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీలను జగన్ వదులుకునే చాన్సే లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.