
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కారణంగా ఆ రాష్ట్రంలో ఎన్నికల పంచాయితీ ఇంకా తగ్గడం లేదు. ఆయన ఏ ముహూర్తాన ఎన్నికల ప్రక్రియకు తెరలేపారో కానీ నిత్యం కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితే వచ్చింది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఎస్‌ఈసీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా యుద్ధం నడుస్తూనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొదటగా పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ శ్రీకారం చుట్టారు.
Also Read: మరో చిచ్చు పెట్టిన నిమ్మగడ్డ రమేశ్
నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రైవేట్‌గా తయారు చేసిన ఈ-–వాచ్ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌పై అధికార పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు, ఈ యాప్‌ను నిలిపివేయాలంటూ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది. దీనిపై అధికార పార్టీ వాదనను హైకోర్టు సమర్థించింది. ఆ తర్వాత ఇంటింటికీ వెళ్లి రేషన్ బియ్యం పంపిణీపై ఎస్ఈసీ నిమ్మగడ్డ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాహనాలపై దివంగత నేత వైఎస్సార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బొమ్మలున్నాయని, అలాగే వైసీపీ జెండాను పోలిన రంగులు వాహనంపై ఉన్నాయని నిమ్మగడ్డ కుదరదన్నారు. దీనిపై కూడా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సానుకూల తీర్పు వచ్చింది ప్రభుత్వానికి.
అలాగే.. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నానితోపాటు ఎమ్మెల్యే జోగి రమేశ్‌లపై గృహ నిర్బంధంతోపాటు మీడియాతో మాట్లాడొద్దని ఎస్ఈసీ ఆదేశాలిచ్చి సంచలనం సృష్టించారు. ఎస్ఈసీ ఆదేశాలపై వీరంతా వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించి న్యాయం పొందారు. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డకు వరుసగా ప్రతికూల తీర్పులే వచ్చాయి. ఈ నేపథ్యంలో మున్సిపాల్టీల్లో ఆగిన చోటు నుంచే తిరిగి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు. దీనిపై జనసేనతోపాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడి, నామినేషన్లు వేయకుండా అడ్డుకుందని, రీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆదేశించాలని 16 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే.. ఎస్ఈసీ వాదనను, నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆ పిటిషన్లను కొట్టి వేసింది న్యాయస్థానం.
Also Read: కేటీఆర్ వర్సెస్ రాంచంద్రరావు.. పంచ్ ఇచ్చిన కేటీఆర్
ఈ నేపథ్యంలో పలువురి నుంచి ఫిర్యాదులు, కలెక్టర్ల నుంచి నివేదికల ఆధారంగా తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి కార్పొరేషన్‌లో 6 వార్డులు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు, ఎర్రగుంట నగర పంచాయతీలో మూడు ఏకగ్రీవాలలో రీ నామినేషన్‌కు ఎస్ఈసీ అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవమైన ఆ 14 చోట్ల రీ నామినేషన్‌కు అవకాశం ఇవ్వడంపై గెలిచిన అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు రెడీఅవుతున్నారు. రేపు హైకోర్టులో పిటిషన్లు వేయనున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో ఎన్నికలపై నీలినీడలు అలుముకుంటున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్