Ration Card Cancellation: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆధార్, ఈ కేవైసీ వెరిఫికేషన్ విధానాన్ని కేంద్రం తెరపైకి తీసుకువచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను కేంద్రం తొలగించింది. అయితే ఇప్పటివరకు దాము 80.6 కోట్ల మందికి లబ్ధి కలిగిస్తున్నామని స్పష్టం చేసింది. ఆహార భద్రత విషయంలో ప్రపంచానికే బెంచ్ మార్క్ లాగా నిలిచామని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటివరకు 20.4 కోట్ల రేషన్ కార్డులను డిజిటలైజ్ చేసామని వివరించింది. వన్ నేషన్, వన్ రేషన్ కార్డు విధానం ద్వారా దేశంలో ఎక్కడైనా ప్రజలకు రేషన్ తీసుకుని అవకాశాన్ని కల్పించామని కేంద్రం పేర్కొంది. “కోవిడ్ కాలంలో దేశ ప్రజలకు ఉచితంగా బియ్యం ఇవ్వడాన్ని ప్రారంభించాం. కోవిడ్ ముగిసిపోయినప్పటికీ దానిని కొనసాగిస్తూనే ఉన్నాం. దేశ ప్రజల ఆహార భద్రత విషయంలో కట్టుబడి ఉన్నాం. ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా ఆహార పదార్థాలను ఉచితంగా ఇస్తూ ప్రజల ఆకలి తీర్చుతున్నామని” కేంద్రం ప్రకటించింది.
రాయితీ భారాలు పెరగడం వల్లే
కేంద్రంపై రాయితీ భారాలు పెరిగిపోయిన నేపథ్యంలో ప్రజలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ విషయంలోనూ అక్రమాలు జరుగుతున్నట్టు కేంద్రం గుర్తించింది. అందువల్లే ఆధార్, ఈ కేవైసీ వెరిఫికేషన్ ను తప్పనిసరి చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. వన్ రేషన్ వన్ నేషన్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చిన కేంద్రం… ఆధార్, ఈ కేవైసీ ద్వారా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను రద్దు చేసింది. అయితే కొన్ని రాష్ట్రాలలో ప్రజల కంటే రేషన్ కార్డులు ఎక్కువ ఉండడాన్ని కేంద్రం గమనించింది. ” రేషన్ కార్డులు ఎన్నికల హామీగా మిగిలిపోయాయి. పార్టీలు అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇస్తున్నాయి. అందులో రేషన్ కార్డుల జారీ కూడా ఒకటి. కొన్ని రాష్ట్రాలలో ప్రజల కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం ఈ కేవైసీ, ఆధార్ ద్వారా తెలిసింది. అందువల్లే వాటిని తొలగించాం. అర్హత ఉన్న వారికి రేషన్ అందాలి. ప్రభుత్వం రాయితీ మీద బియ్యం ఇస్తోంది కాబట్టి.. కచ్చితంగా అవి పేదలకు మాత్రమే దక్కాలి. దళారులు మధ్యలో ప్రవేశించి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం. అందువల్లే కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని” కేంద్రం వివరించింది..కాగా, కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా దేశాలు ప్రజలను పట్టించుకోకపోతే.. భారత్ మాత్రమే ప్రజల కోసం ఉచితంగా రేషన్ బియ్యాన్ని సరఫరా చేసిందని అప్పట్లో గ్లోబల్ మీడియా వ్యాఖ్యానించింది. ఇదే విషయాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రస్తావించింది.