Canada Population: ట్రూడో చేసిన వ్యాఖ్యలతో కెనడా_భారత్ మధ్య దౌత్య సంబంధాలు ఇరకాటంలో పడ్డాయి. ఇరుదేశాలు దౌత్యాధికారులను పరస్పరం బహిష్కరించుకున్నాయి. వివిధ విదేశీ వేదికల మీద గొంతులు వినిపిస్తున్నాయి.. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకు భారత్ కారణమని కెనడా ఆరోపిస్తుంటే, మా దేశాన్ని ముక్కలు చేయాలనుకున్న ఆ వ్యక్తులకు మీరు ఆశ్రయం కల్పిస్తున్నారని భారత్ విమర్శిస్తోంది.. దీంతో రెండు దేశాలకు సంబంధించిన వివాదం చినికి చినికి గాలివానలా మారే ప్రమాదం ఉందని పాలు దేశాల దౌత్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగానే కెనడాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం మీడియాను షేక్ చేస్తోంది.
అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన కెనడా.. జనాభా పెరుగుదల విషయంలో సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఏడాది జూన్ నెల నుంచి ఈ ఏడాది జూలై 1 మధ్యకాలంలో జనాభా పెరుగుదల రేటు 70 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. దీంతో ఒక్కసారిగా కెనడా దేశంపై ప్రపంచ మీడియా దృష్టి సారించింది. కెనడా దేశ జనాభా 70 సంవత్సరాల గరిష్టానికి చేరుకోవడానికి గల కారణాలను అన్వేషించడం మొదలుపెట్టింది. జనాభా పెరుగుదలకు కారణం విదేశాల నుంచి వస్తున్న వలసలే అని తెలుస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు జనాభా పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రపంచ మీడియా చెబుతోంది. కన్నడలోని గృహాల కొరత సంక్షోభం తారాస్థాయికి చేరుతున్న నేపథ్యంలో ఈ జనాభా పెరుగుదల విషయం తెరపైకి వచ్చిందని ప్రపంచ మీడియా స్పష్టం చేస్తోంది. ఇక కెనడాలో జనాభా పెరుగుదలకు సంబంధించి తాజా గణాంకాలను స్టాట్ కాన్(కెనడా గణాంక శాఖ) ఇటీవల విడుదల చేసింది.
కెనడా నిపుణుల ప్రకారం, విదేశీయుల రాకతో ప్రజాసేవలు, కెనడా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఇక ఈ ఏడాది జూలై 1 నాటికి కెనడా మొత్తం జనాభా 40,097,761 కు చేరుకుంది. ఏడాది లెక్కలతో పోలిస్తే కొత్తగా 1,158,705 మంది జనాభా లెక్కల్లో చేరారు. ఈ పెరుగుదలలో 98 శాతం విదేశీయుల రాక వల్లే అని అక్కడి నిపుణులు చెబుతున్నారు. జూలై 1 నాటికి కెనడా నాన్ పర్మినెంట్ రెసిడెంట్ల సంఖ్య 2,198,679. గత ఏడాది ఇదే సమయంలోనే లెక్కలతో పోలిస్తే ఇది 46% అధికమని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఈట నమోదవుతున్న జనాభా వృద్ధిరేటులో ఇంతటి పెరుగుదల నమోదు కావడం 1972 తర్వాత ఇదే తొలిసారి అని అక్కడి వారు చెబుతున్నారు. మరోవైపు కెనడాలో తాత్కాలిక ప్రాతిపదికన ఉంటున్న వారి సంఖ్యను కెనడా గణాంకాల శాఖ తక్కువగా అంచనా వేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్టాట్ కాన్ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. విదేశీయుల సంఖ్యను మరింత కచ్చితంగా లెక్కించేందుకు ఈ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీని ప్రకారం వీసా గడువు ముగిసి దేశంలో ఉంటున్న వారు, వీసా ఉద్ధరణ ప్రయత్నంలో ఉన్న వారిని కూడా నాన్ పర్మినెంట్ రెసిడెంట్ గా స్టాట్ కాన్ గుర్తించింది.