Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: ఏపీలో కాంగ్రెస్ కు షర్మిల జీవం పోయగలరా? పూర్వ వైభవాన్ని సాధించి పెట్టగలరా?

YS Sharmila: ఏపీలో కాంగ్రెస్ కు షర్మిల జీవం పోయగలరా? పూర్వ వైభవాన్ని సాధించి పెట్టగలరా?

YS Sharmila: ఏపీలో కాంగ్రెస్ కు షర్మిల జీవం పోయగలరా? పూర్వ వైభవాన్ని సాధించి పెట్టగలరా? విజయపథం వైపు నడిపించగలరా? అంటే మాత్రం సరైన సమాధానం దొరకడం లేదు. అది దాదాపు అసాధ్యమేనని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉనికి తో పాటు ఒక వెలుగు వస్తుందని నమ్ముతున్న వారు ఉన్నారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఏపీకి అన్యాయం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్ పార్టీ విభజనకు పూనుకుంది.ఆ పాపంతో ఏపీలో దారుణంగా దెబ్బతింది.ప్రత్యేక రాష్ట్రం కలలను సాకారం చేసుకున్న తెలంగాణలో కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తొమ్మిదిన్నర ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ లో పునరుత్తేజం తేవాలని హై కమాండ్ ఏపీ పగ్గాలను షర్మిలకు అందించాలని డిసైడ్ అయ్యింది.

కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు. గత రెండు ఎన్నికల్లో జాతీయ పార్టీ అని చూడకుండా పాతాళానికి తొక్కేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 2.8%, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 1.17 శాతం ఓట్లు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ నోటా తో పోటీ పడడం విశేషం. వైయస్సార్ అకాల మరణం తరువాతనే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం ప్రారంభమైంది. సీఎం పదవి ఇవ్వలేదన్న కోపంతో కాంగ్రెస్ పార్టీతో జగన్ విభేదించారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆగ్రహానికి గురయ్యారు. జగన్ సొంత పార్టీని పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను, పార్టీ శ్రేణులను, చివరికి ఓటర్లను సైతం తన వైపు తిప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. టిడిపికి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా వైసీపీని రాష్ట్ర ప్రజలు చూడడం ప్రారంభించారు. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ అంటే వైసిపి.. వైసీపీ అంటే కాంగ్రెస్ అన్న రేంజ్ లో ఏపీలో పరిస్థితి మారిపోయింది.

సరిగ్గా ఇటువంటి సమయంలోనే అదే కుటుంబానికి చెందిన షర్మిల కాంగ్రెస్ పగ్గాలు అందుకోనున్నారు. ఉనికి కోల్పోయిన ఏపీలో పార్టీకి ఒక దిక్సూచిగా షర్మిల నిలుస్తారని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం భావిస్తోంది. అయితే ఆమె ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కు పూర్వ వైభవం తేగలరా? అనేది సందేహమే. ఎందుకంటే ఆమె మొన్నటి వరకు తాను తెలంగాణ కోడలినని చెప్పుకున్నారు. మెట్టినింట రాజకీయం చేయడానికి వచ్చానని ప్రకటనలు చేశారు. ఇప్పుడు నేను ఆంధ్ర బిడ్డను అని చెబితే ఇక్కడి ప్రజలు నమ్ముతారా? తెలంగాణలో అధికారంలోకి వచ్చాం కాబట్టి.. ఇక్కడ కూడా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ ఆ దిశగా ఎటువంటి చర్యలు లేవు. రాష్ట్ర విభజన తరువాత రఘువీరారెడ్డి, శైలజా నాథ్, గిడుగు రుద్రరాజు పిసిసి అధ్యక్షులుగా ఉన్న పార్టీ పరిస్థితి మాత్రం ఏమంత బాగాలేదు. కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు రాష్ట్రంలో పూర్తి బాధ్యతలు అప్పగించినా.. ఉన్నది వంద రోజులు మాత్రమే. పూర్తిస్థాయిలో అభ్యర్థులను బరిలో దించే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పటికిప్పుడు అసాధ్యమేనని తేలుతోంది.

ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు అప్పగించే సమయంలోనే.. జగన్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేలా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జగన్ వైసిపి అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. దీంతో సీట్లు కోల్పోయిన చాలామంది బాధితులు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. టిడిపిలో అవకాశాలు లేవు. జనసేనలో చేరిన దొరకవు. ఇదే సమయంలో రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలి. ప్రజల్లో ఉండాలి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవడంతో.. వీరందరికీ ఆమె ఒక ఆశాదీపంలా మారారు. అందుకే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సుధాకర్ బాబు వంటి వారంతా షర్మిల వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. వీరే కాదు అభ్యర్థుల మార్పుతో బాధితులుగా మిగులుతున్న వారంతా షర్మిల వైపే చూడబోతున్నారు. వారు కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది. రాహుల్ భావిస్తున్నట్టు 15% వరకు కాకపోయినా.. పదికి మించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కాంగ్రెస్ టాస్క్ పూర్తవుతుంది. షర్మిల కోరుకునే విధంగా వైసిపి ఓటింగ్ కు గండి పడుతుంది. తద్వారా 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ బలియమైన శక్తిగా మారేందుకు మార్గం సుగమం అవుతుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version