Power Star Pawan Kalyan-Arvind Kejriwal: యుద్ధంలోకి దిగాక విజయమో.. వీర స్వర్గమో అన్నట్టుగా ముందుకెళ్లాలి. ఈ విషయంలో ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్నా హాజరే బ్యాచ్ లో నీతిమంతమైన రాజకీయాల కోసం గళమెత్తిన ఆయన 2012లో ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా పాలనతోనే మెరుగైన సమాజం సాధ్యమని ఢిల్లీలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అన్నా హాజరేను ఎదురించారు. ఆయన సిద్ధాంతాలను పక్కనపెట్టారు. కేజ్రీవాల్ నేరుగా ప్రజల్లోకి వెళ్లారు. వారితోనే ఉన్నారు. తన వాణి వినిపించారు. మొదటిసారే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి 28 సీట్లు వచ్చినా కుంగిపోలేదు. అనంతరం ప్రజల మెప్పు పొంది వరుసగా ఢిల్లీకి సీఎం అయ్యారు. బీజేపీని చిత్తుగా ఓడించి గెలుపుబావుటా ఎగురవేశారు.
దేశ రాజధానిపైనే కాదు.. పక్కనున్న పంజాబీల మనసు గెలిచారు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఇప్పుడు దేశంలో నరేంద్రమోడీకి ప్రత్యామ్మాయంగా అనుకుంటున్న మమతా బెనర్జీ, కేసీఆర్ లను తోసిరాజని కేజ్రీవాల్ జాతీయ నేతగా అవతరించారు. పంజాబ్ లో ఆప్ విజయంతో ఇప్పుడు భారతవని చూపునంతా కేజ్రీవాల్ వైపు తిప్పుకున్నారు. బీజేపీకి ప్రత్యామ్మాయ రాజకీయ శక్తిగా అవతరించారు.
Also Read: తర్వాత టార్గెట్ ఆ రెండు రాష్ట్రలే.. మోడీ వ్యూహం మొదలెట్టేశారు
దేశ రాజకీయాలంటేనే రొచ్చు. కోట్లు కుమ్మరించి గెలుస్తున్న రోజులవీ. డబ్బు, మతం, కులం ప్రాతిపదికన ఓట్లు చీలి పార్టీలు గెలుస్తున్నాయి. అందుకు భిన్నంగా డబ్బులు పంచకుండా.. కేవలం అభివృద్ధి, నీతి నిజాయితీలతో సంక్షేమం ప్రాంతిపదికగా ఓటర్ల మనసులు గెలుచుకొని నిజమైన హీరోగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ నిలిచారు.
ఇప్పుడు అచ్చం అలాంటి లక్షణాలే తెలుగునాట పవన్ కళ్యాణ్ కు ఉన్నాయి. పార్టీని నడిపేందుకు డబ్బులు లేకపోతే అవినీతి చేయకుండా.. విరాళాలు సేకరించకుండా మళ్లీ సినిమాలు తీసి కష్టపడి సంపాదించి ఆ డబ్బులతో పవన్ రాజకీయాలు చేస్తున్నారు. అంతే తప్ప ఇతర పార్టీలలాగా అవినీతి రాజకీయాలను అస్సలు ప్రోత్సహించరు.
ఇక కేజ్రీవాల్ లాగానే అవినీతి రహిత రాజకీయాలను పవన్ చేస్తారు. ఎన్నికల్లో డబ్బులు అస్సలు పంచరు. కేజ్రీవాల్ లాగానే ఏపీలో పోటీచేసిన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఓటుకు నోటు డబ్బులు పంచలేదు. అందుకోసం తాను గెలవకున్నా కూడా నమ్మిన సిద్ధాంతం కోసం దిగజారలేదు. ఇప్పటికీ కూడా గెలిచినా, గెలవకపోయినా ఈ అవినీతి రాజకీయాలను పవన్ పోత్సహించరు. అందుకే పెద్దగా డబ్బు ప్రభావం లేని స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు వెల్లువలా గెలిచారు. గ్రామాల స్వరాజ్య స్థాపనకు కృషి చేస్తున్నారు.
కేజ్రీవాల్ చేసింది.. పవన్ చేయనిది కేవలం పార్టీ బలోపేతం మాత్రమే. బలమైన నాయకులు, కార్యకర్తలను తయారు చేసి విస్తరించడంలో కేజ్రీవాల్ కృషి చేశారు. ఆ ఒక్కటి పవన్ చేస్తే ఏపీలో బలమైన శక్తిగా అవతరిస్తారు. ఇతర ప్రాంతాలకు జనసేనను విస్తరింపచేయగలరు. ఎప్పుడూ ప్రజల తరుఫున ప్రశ్నించడానికే తాను ముందుంటానని.. ప్రజలు సీఎం కుర్చీ ఇచ్చినా ఇవ్వకున్నా ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పిన గొప్ప నేత పవన్. ఎప్పుడూ సీఎం సీటు కోసం ఆయన ఆశించలేదు. రాజకీయాల్లో తనది 25 ఏళ్ల లాంగ్ ప్రాసెస్ అని.. అందుకే ఇప్పటికిప్పుడు రాజ్యాధికారం అవసరం లేదని అంటున్నారు.
అయితే నేటి ఇన్ స్టంట్ రాజకీయాల్లో ప్రజలకు నీతిమంతమైన పాలన అందాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నికార్సైన నేతలు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కేజ్రీవాల్ వ్యూహాలను ఏపీలో పవన్ అవలంభించి పార్టీని బలోపేతం చేసి ప్రజల్లోకి వెళితే దేశంలోనే మరో నీతిమంతమైన నేతగా పవన్ ఆవిర్భవిస్తారు. ఆ దిశగా ఆయన కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..
Also Read: బీజేపీ విజయ రహస్యం ఏంటో తెలుసా?