Byreddy Siddharth Reddy: రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ హనీమూన్ పిరియడ్ ముగిసింది. మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మహా అయితే ఒక ఏడాది పాలన సాగుతుంది. ఉన్న ఏడాది ఎన్నికల వ్యూహాలకే గడిచిపోతుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే అన్ని పార్టీలు వ్యాహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలో అసమ్మతిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. అధికార పక్షం నుంచి టీడీపీ, జనసేనలోకి భారీ వలసలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడేళ్లుగా సైలెంట్ గా ఉన్న గంటా శ్రీనివాసరావు ఇటీవల మంత్రివర్గ విస్తరణ పరిణామాలు చూసి టీడీపీ కండువాతో ప్రెస్ మీట్ సైతం పెట్టేశారు. టీడీపీలోకి త్వరలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు వస్తారని తేల్చిచెప్పారు.
రాజకీయ వ్యూహంలో భాగంగా అన్నారో.. లేక అధికార పార్టీ నేతల నుంచి సమాచారం ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఒక్కో పరిణామం చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో మారో వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. నెల్లూరు వైసీపీలో విభేదాల పర్వం మరవక ముందే కర్నూలు జిల్లాలో బైరెడ్డి సిద్దార్థరెడ్డి రూపంలో కలకలం రేగింది. సోషల్ మీడియా స్టార్, వైసీపీ యంగ్ డైనమిక్ లీడర్, ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టీడీపీ గూటికి చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష టీడీపీ చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. టీడీపీతో ఆ కుటుంబానికి విడదీయ రాని బంధం ఉంది. టీడీపీ తరుపున పోటీచేసిన బైరెడ్డి శేషశయనారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా నందికొంట్కూర్ కేంద్రంగా బైరెడ్డి కుటుంబం కొన్ని దశాబ్దాలుగా రాజకీయం నడుపుతోంది.
Also Read: Prashant Kishor: కాంగ్రెస్ లోకి పీకే ఎంట్రీ ఖాయమైనట్టేనా.. అప్పుడే భగ్గుమంటున్న సీనియర్లు..
శేషశయనారెడ్డి వారసుడి రాజకీయ తెరంగేట్రం చేసిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సైతం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. కానీ వివిధ కారణాలతో 2012లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారను. రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటుచేశారు. ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన అన్న కుమారుడే సిద్దార్థరెడ్డి. 2018 వరకూ తమకు రాజకీయంగా అండగా ఉన్న టీడీపీ పక్షానే సిద్ధార్ధరెడ్డి ఉండేవారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జిగా నియమితులయ్యారు. వైసీపీ టిక్కెట్ తనకే లభిస్తుందని ఆశించారు. అయితే సామాజిక సమతూకంలో భాగంగా అధిష్టానం ఆర్థర్ కు టిక్కెట్ ఇచ్చింది. అయితే అధినేత జగన్ ఆదేశాలతో ఆర్థర్ ను గెలిపించుకున్నారు సిద్ధార్థ్ రెడ్డి. ఎన్నికల తరువాత ఆర్దర్, సిద్ధార్థ్రెడ్డి మధ్య విభేదాలు పొడచూపాయి. అప్పట్లో జిల్లా మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలోనే ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. అధినేత జగన్ వరకూ పంచాయతీ నడిచింది. కానీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ హామీ మాత్రం దక్కలేదు. ఇటీలవల సిద్ధార్థరెడ్డికి క్యాబినెట్ ర్యాంకు ఉన్నశాప్ చైర్మన్ పదవి లభించింది.
ఆ క్రేజ్ ను తట్టుకోలేక..
యువ లీడర్ గా సిద్ధార్థ రెడ్డికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. యువ నాయకుడుగా ఎదుగుతున్నారు. దీంతో వైసీపీ అధిష్ఠానం ఆయనపై ఫోకస్ పెంచింది. ఆయనకు వ్యతిరేకంగా ఉండే గ్రూప్ ను ప్రోత్సహిస్తోందన్న టాక్ నడుస్తోంది. అటు నందికొట్కూరు పంచాయతీ తేలకపోవడం, టిక్కెట్ పై స్పష్టత లేకపోవడంతో సిద్ధార్థ రెడ్డిలో అభద్రతా భావాన్ని పెంచింది. ఇప్పటివరకూ తన కుటుంబానికి అండగా ఉన్న టీడీపీ దిక్కు ఆయన చూడడం ప్రారంభించారు. అందుకు చంద్రబాబు, లోకేష్ లు కూడా అటు నుంచి కదలికలు ప్రారంభించారు. ఏకంగా చంద్రబాబు లైన్ లోకి వచ్చి సిద్ధార్థ రెడ్డికి అభయమిచ్చేశారు. పార్టీలోకి వస్తే నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైసీపీలో సిద్ధార్థ రెడ్డి దూకుడు తగ్గించారు. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో సిద్ధార్థ రెడ్డి రహస్య మంతనాలు చేసినట్టు కూడా ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఆరోపణలను సిద్ధార్థ రెడ్డి ఖండించలేదు.. సమర్థించలేదు. కానీ ఈ పరిణామాలతో వైసీపీలో కాస్తా కలవరం కనిపిస్తోంది. సిద్ధార్థ్ రెడ్డి విషయంలో అనవసరంగా ఫోకస్ కల్పించామని ఆ పార్టీ నాయకులు బాధపడుతున్నారు. ఇప్పుడు కేబినెట్ హోదాతో సమానమైన శాప్ చైర్మన్ పదవి ఇచ్చినా సిద్ధార్థ్ రెడ్డి ఇలా చేయడం భావ్యం కాదంటున్నారు. భైరెడ్డి ఫాలోవర్ష్ మాత్రం ప్రస్తుతానికి గుంభనంగా ఉన్నారు.
Also Read:CM KCR- National Politics: కల చెదిరే.. ఒంటరిగా మిగిలిపోయిన కేసీఆర్!?
Recommended Videos