రాజకీయాల్లో ఎన్నికల సందర్భంలో కానీ.. మరేదైనా సందర్భం వచ్చినప్పుడు కానీ కొందరు శత్రువులు.. మిత్రులు అవుతుంటారు. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు. దీనిని నిజం చేస్తూ.. ఇప్పుడు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో కొత్త కొత్త పొత్తులు వెలుస్తున్నాయి. అధికార వైసీపీకి ఊహించని మద్దతు లభించింది.
Also Read: విజయసాయిని దెబ్బకొడితేనే ఆశలు..!
తిరుపతిలో ఉప ఎన్నికలో వైసీపీకి సీపీఐ మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అనుబంధ పార్టీగా పేరున్న సీపీఐ నుంచి మద్దతు లభించనుందనే సమాచారంతో వైసీపీ షాక్‌కు గురవుతోంది. సీపీఐ అనూహ్య నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణాలూ లేకపోలేదు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో సోదర వామపక్ష పార్టీ సీపీఎం తమ అభ్యర్థిని నిన్న ప్రకటించింది. నెల్లూరు యాదగిరి అభ్యర్థిత్వాన్ని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసులు ప్రకటించారు. అయితే అభ్యర్థి ఎంపిక ఏకపక్షంగా జరిగిందని, మాట మాత్రం కూడా తమతో చర్చించకుండా అభ్యర్థిని ప్రకటిస్తే తామెలా మద్దతిస్తామంటూ సీపీఐ అసంతృప్తిలో ఉంది. దీంతో సీపీఎంకు రెడ్‌సిగ్నల్ ఇచ్చింది.
మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ–-సీపీఐ అండర్‌స్టాండింగ్‌తో పొత్తు కుదుర్చుకున్నాయి. అయితే.. కొన్ని చోట్ల టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించకపోవడంతో సీపీఐ అగ్రనేతలు ఆగ్రహంగా ఉన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల, చిత్తూరు జిల్లా తిరుపతి కార్పొరేషన్ పరిధిలో టీడీపీ పొత్తు ధర్మాన్ని ఖాతరు చేయకుండా సీపీఐ అభ్యర్థులున్న చోట మద్దతు ఇవ్వకుండా స్వయంగా బరిలోకి దిగింది. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్‌లో టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఇన్‌చార్జ్ నరసింహయాదవ్ తమ్ముడు బరిలో నిలిచాడు. ఇదే డివిజన్ నుంచి సీపీఐ తన అభ్యర్థిని నిలిపింది. పోటీ నుంచి తప్పుకుని మద్దతు ఇవ్వాలని సీపీఐ అగ్రనేత నారాయణ ప్రాధేయపడినా వినిపించుకోలేదు. దీంతో నారాయణ టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Also Read: కమ్మని సాంబారులా పళని పాలన
అందుకే.. ఇంత కాలం చంద్రబాబుకు లెప్ట్ అండ్ రైట్‌గా వ్యవహరిస్తూ వస్తున్న రామకృష్ణ, నారాయణ మాటల్లో ఇటీవల వచ్చిన మార్పును గమనించాల్సి ఉంది. ప్రజాదరణ పక్కన పెడితే టీడీపీ అనుబంధ పార్టీగా ముద్రపడిన సీపీఐ నుంచి అనూహ్య మద్దతు లభిస్తుందన్న సంకేతాలు వైసీపీని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ పొత్తు పొడిచి కలిసి బరిలోకి దిగుతారా..? లేక వైసీపీ సింగిల్‌గానే పోటీకి వెళ్తుందా..? అనేది చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్