హుజురాబాద్ లో ఉప ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. తమ ప్రభావాన్ని చూపెట్టుకోవాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్థులను భయపెట్టాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హుజురాబాద్ లో మకాం వేసి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. మాటలతోనే తూటాలు పేల్చుకుంటున్నారు. పదునైన పదజాలంతో వాగ్బాణాలు వేస్తున్నారు.
ఇప్పటికే బీజేపీ ప్రజాదీవెన యాత్ర పేరుతో నియోజకవర్గంలో చుట్టుముట్టి ప్రజలను దీవించాలని కోరారు. కానీ అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం తన అభ్యర్థిని ఇంతవరకుప్రకటించలేదు. కాంగ్రెస్ కూడా స్తబ్దుగానే ఉంది. దీంతో ఒక్క బీజేపీనే ప్రచారంలో ముందుంది. టీఆర్ఎస్ కూడా తన ముద్ర వేస్తూ పథకాల ప్రకటనతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల్లో పరస్పర దూషణలు పెరిగిపోతున్నాయి.
అనారోగ్య కారణాల వల్ల ఈటల ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినా వీల్ చైర్ కే పరిమితం అయ్యారు. దీంతో ఆయన ప్రచారం ఎలా చేస్తారని మంత్రి హరీశ్ రావు వ్యంగ్యంగా మాట్లాడడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవత్వంమరిచిపోయి ఇలా మాట్లాడడం తగదని హితవు పలుకుతున్నారు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఓదార్చేది పోయి కించపరచేలా మాట్లాడడం తగదన్నారు.
దీంతో మామా అల్లుళ్లపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే కేసీఆర్, హరీశ్ రావు హుజురాబాద్ లో పోటీ చేసేందుకు సిద్ధమేనా అని సవాలు విసిరారు. కేసీఆర్ అయినా హరీశ్ అయినా సరే ఎవరైనా పోటీకి దిగాలని సూచించారు. నిజాయితీగా ఓట్లు అడుక్కోకుండా అడ్డదారుల్లో రావడమేమిటని మండిపడ్డారు దీనిపై ఈటల తీవ్ర పదజాలంతో ఆవేశంగా మాట్లాడారు. నోట్ల కట్టలకు ఓట్లు రావని చెప్పారు. ప్రజా బలం తనకుందని పేర్కొన్నారు.
పోలీసులు, ఇంటలిజెన్స్ వాళ్లను పెట్టుకుని తన అనుచరులను భయపెట్టడంలో కేసీఆర్ కు భయం పట్టుకుందని తెలిసిపోతోందన్నారు. ఓటమి భయంతోనే పథకాల రూపకల్పన నాటకం ఆడి ప్రలోభాలకు గురి చేయడం ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దళితులపై లేని ప్రేమ ఒలకబోస్తూ దళితబంధు పథకం పేరుతో మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.