Malkajgiri BRS
Malkajgiri BRS: వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి మల్కాజ్ గిరి శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు మీద చర్యలు ప్రారంభించింది. ఇవి నేరుగా కాకుండా అంతర్గతంగా మొదలుపెట్టింది. ఈ స్థానాన్ని ఇప్పటికే కేసీఆర్ హనుమంతరావుకు కేటాయించారు. తన కుమారుడు రోహిత్ రావు కు మెదక్ సీటు కావాలని హనుమంతరావు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. భారత రాష్ట్ర సమితి పెద్దల సహకారంతోనే ఆయన అక్కడ సేవా కార్యక్రమాలు కూడా ప్రారంభించారని టాక్ నడుస్తోంది. అధిష్టానం ఆదేశాల మేరకే రోహిత్ రావు అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ.. చివరి నిమిషంలో టికెట్ నిరాకరించడం పట్ల హనుమంతరావు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఈ వ్యవహారం మొత్తానికి హరీష్ రావు కారణమని హనుమంతరావు భావించి.. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్లి అక్కడ హాట్ కామెంట్స్ చేశారు. అదే రోజు ముఖ్యమంత్రి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
అయితే హరీష్ రావు మీద చేసిన కామెంట్స్ పై హనుమంతరావు వెనక్కి తగ్గలేదు. దీనిపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఇతర ముఖ్య నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్ గిరి స్థానం నుంచి హనుమంతరావును తప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆయన కూడా హనుమంతరావుకు ఉద్వాసన పలకాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అల్లుడు, 2019 ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మర్రి రాజశేఖర్ రెడ్డి కి అవకాశం ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్కడికి వెళ్లి పని చేసుకోవాలని రాజశేఖర్ రెడ్డికి కెసిఆర్ సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల మల్లారెడ్డి తన జన్మదినం సందర్భంగా ఆశీస్సుల కోసం కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లారు. ఆ సమయంలో మల్లారెడ్డి వెంట ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. దీంతో రాజశేఖర్ రెడ్డి కి మల్కాజ్ గిరి స్థానం కేటాయించినట్లు దాదాపుగా రూఢీ అయింది.
హనుమంతరావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆపరేషన్ మల్కాజ్ గిరిని భారత రాష్ట్ర సమితి స్టార్ట్ చేసింది.. ప్రభుత్వపరంగా ఇచ్చే ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బీసీ బంధు, దళిత బంధు చెక్కుల్లో కోత విధించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు స్థానిక నాయకత్వాన్ని హనుమంతరావుకు దూరం చేసే ప్రయత్నం మొదలుపెట్టింది. అంతేకాకుండా తమ భూములను కబ్జాలు చేశారని హనుమంతరావు మీద పలువురు ముందుకు రావడం వెనక భారత రాష్ట్ర సమితి పెద్దలు ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. బుధవారం భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో హనుమంతరావుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. తమ భూములను ఆక్రమించారని హనుమంతరావు మీద బీజేవైఎం నేతలు ఆరోపణలు చేశారు. 17న హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ నష్టం ఆ నియోజకవర్గం మీద పడకుండా భారత రాష్ట్ర సమితి ఇప్పటినుంచే ప్రణాళికలు అమలు చేస్తోంది. కాగా హనుమంతరావు వ్యవహారంపై ఇటీవల భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను విలేకరులు ప్రశ్నించగా.. కొన్నిసార్లు మా మౌనం కూడా సమాధానమే అని వ్యాఖ్యానించడం విశేషం.