Sai Pallavi
Sai Pallavi: సహజ సిద్ధమైన నటనకు, నెమలి లాంటి నాట్యానికి, అద్భుతమైన హావభావాలకు పెట్టింది పేరైన సాయి పల్లవి ప్రస్థానం తెలుగు నాట ఇక ముగిసినట్టేనా? ఇక ఇప్పట్లో ఆమె తెలుగు సినిమాలు చేయడం కష్టమేనా? అంటే వీటికి అవును అనే సమాధానమే వస్తోంది. విరాటపర్వం తర్వాత సాయి పల్లవి మరి తెలుగు సినిమాలో కనిపించలేదు. అప్పట్లో తమిళ డబ్బింగ్ సినిమా గార్గి ద్వారా తెరపై కనిపించింది. ఆ తర్వాత సాయి పల్లవి కనిపించడం మానేసింది.
ఈ లోగానే ఆమె ఇండస్ట్రీని వదిలేసిందని, తను స్వతహాగా డాక్టర్ కాబట్టి హాస్పిటల్ పెట్టుకుందని.. రకరకాల కామెంట్స్ వినిపించాయి. వీటికి చెక్ పెడుతూ ఆ మధ్య శివ కార్తికేయ హీరోగా నటించే ఓ తమిళ సినిమాకు సైన్ చేసిందని, ఆ సినిమా ప్రారమానికి కమలహాసన్ కూడా వచ్చినట్టు, అతనే నిర్మిస్తున్నట్టు, నా పేరు మావీరన్ అని.. రకరకాల వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సహజంగానే తెలుగు మీడియా లైట్ తీసుకుంది. సాయి పల్లవి కి మీడియా మేనేజ్మెంట్ రాకపోవడం, “కవరేజ్” తెలియకపోవడం తో మీడియాలో కనిపించడమే తగ్గిపోయింది. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోకి చెల్లెలి పాత్ర వస్తే చేయనని చెప్పడం వల్లే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయనే టాక్ నడుస్తోంది.
తెలుగు ఇండస్ట్రీ ఆమెను వదిలేసిందో, లేక ఆమె ఇండస్ట్రీని వద్దనుకుందో గాని ఆమెలో పూర్తి నటిని ఆవిష్కరించే పాత్ర ఇటీవల కాలంలో రాలేదు. ఆమె అల్లాటప్పాగా ఏ పాత్ర పడితే ఆ పాత్ర ఒప్పుకోదు. చివరికి కోట్లు ఇస్తామన్నా కూడా యాడ్స్ లో నటించదు. ఇక తెలుగు సినిమాలో స్టార్స్ ఈగో ఫీలింగ్ అందరికి తెలిసిందే కాబట్టి.. కొన్ని పాత్రలు ఆఫర్ చేస్తే ఒప్పుకోలేదని.. ఆమెకు పాత్రలు రాకుండా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ సాయి పల్లవి తన స్టాండ్ మార్చుకోలేదు. తనకు నచ్చని పాత్రల వెంట పరుగులు తీయదు. అఫ్కోర్స్ తమిళంలో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఆమె సున్నితంగా తిరస్కరించింది.
అయితే సాయి పల్లవి నటన చూసిన సునీల్ పాండే అనే దర్శకుడు ఆమెను అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. తను రాసుకున్న పాత్రకు ఆమె సరిపోతుందని భావించి అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో ఒక సినిమాకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి మధ్య ఫోటోషూట్ కూడా పూర్తయిందని, సినిమా షూటింగ్ కూడా మొదలైనట్టు తెలుస్తోంది. అయితే ఇది పీరియాడిక్ డ్రామా అని, ఇందులో లవ్ స్టోరీ ఎక్కువగా ఉంటుందని బాలీవుడ్ వర్గాల భోగట్టా. ఈ సినిమా కనుక విజయవంతం అయితే సాయి పల్లవి బాలీవుడ్ సినిమాల్లోనే స్థిరపడటం ఖాయం. అన్నట్టు పల్లవి తిరస్కరించిన చెల్లెలు పాత్రల్లో ఓ ప్రముఖ నటి నటించిందని, ఆ సినిమాలు పరాజయం పాలయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.