Mynampally Hanumantha Rao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కొందరు బీఆర్‌ఎస్ నేతల తీరు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. టికెట్ దక్కని వారు ఒకలా నిరసన తెలుపుతుంటే.. టికెట్ దక్కిన నేతలు కూడా తమ చేతలు, మాటలతో పార్టీకి కొరకరాని కొయ్యలా తయారవుతున్నారు. ఇందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావే ఉదాహరణ. అసెంబ్లీ టికెట్ మళ్లీ దక్కినా.. హరీశ్‌రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. దీంతో ఆయన స్థానంలో మరొకరికి అవకాశం బీఆర్‌ఎస్ భావిస్తోంది. అదే సమయంలో మైనంపల్లిని పార్టీ నుంచి పంపించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎంపిక తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్టు సమాచారం.
కొడుకు టిక్కెట్ కోసం కయ్యం..
మల్కాజిగిరి సీటు తనకు కేటాయించడంతోపాటు మెదక్ నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని, లేకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తామని హన్మంతరావు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి హరీశ్‌రావుపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి కొద్ది సమయానికి ముందు ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తీరా అభ్యర్థుల జాబితాలో మల్కాజిగిరి అభ్యర్థిగా ఆయన పేరు ఉండటంతో ఇదే విషయాన్ని విలేకరులు సీఎం వద్ద ప్రస్తావించారు. ‘టికెట్ కేటాయించాం. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలా? లేదా అనేది ఆయన ఇష్టం’ అని సీఎం వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తదితరులు మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు.
స్పష్టత ఇచ్చినా పట్టుపట్టడంతో…
గత కొంతకాలంగా మెదక్ అసెంబ్లీ స్థానంలో మైనంపల్లి కుమారుడు రోహిత్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. రోహిత్‌కే మెదక్ టికెట్ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళనలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మెదక్ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డే మళ్లీ పోటీ చేస్తారని పార్టీ స్పష్టత ఇచ్చింది. స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా మైనంపల్లి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తామని పేర్కొనడం, హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని సీరియస్‌గా పరిగణించిన పార్టీ అధిష్ఠానం మల్కాజిగిరి నుంచి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పరిశీలనలో రెండు పేర్లు..
మల్కాజ్‌గిరి నుంచి మైనంపల్లి స్థానంలో పోటీ చేసే అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్ వేట మొదలు పెట్టింది. మర్రి రాజశేఖర్‌రెడ్డి, శంబీపూర్ రాజు పేర్లతోపాటు మరో పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అభ్యర్థిగా ఎవరిని నిర్ణయిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయో అంచనాకు వచ్చిన తర్వాత నిర్ణయం వెల్లడించనున్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ నేతలతో ‘మైనంపల్లి’ మంతనాలు
మరోవైపు మైనంపల్లి హన్మంతరావుతో కాంగ్రెస్ నాయకులు మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌లో ఇప్పటికే ఉన్నవారికి, సీనియర్ నాయకులకు కూడా కుటుంబంలో రెండు టిక్కెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం ఆసక్తి చూపడం లేదు. గత ఎన్నికల్లో అనివార్య పరిస్థితుల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులకు మాత్రమే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో మైనంపల్లి పయనం ఎటువైపో అనేది చర్చనీయాంశంగా మారింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Brs leaders demands action on mla mynampally hanumantha rao allegations on harish rao
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com