Women in BRS list: ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట.. అచ్చం గిట్లనే ఉంది తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రవు ముద్దుల తనయ కల్వకుంట్ల కవిత తీరు. అయ్యను ఓప్పించి పార్టీలో 33 శాతం మహిళలకు టిక్కెట్లు ఇప్పించలేని కవితక్క.. దేశంలో మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని.. ఈమేరకు పార్లమెంట్‌లో చట్టం చేయాలని పోరాటం చేస్తదట. తాజాగా కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. 115 స్థానాల్లో పోటీచేసే లిస్ట్ ఆగస్టు 21 విడుదల చేశారు. ఈ జాబితా చూస్తుంటే.. కేసీఆర్ తరచూ అనే మాటలు ‘చెప్పుటోడు ఎన్నైనా చెప్తడు.. ఇనేటోనికి ఉండాలె కదా’ గుర్తొస్తున్నాయి. ఈ మాటలు ఇప్పుడు కవితకు అచ్చంగా సరిపోతున్నాయి.
ఢిల్లీలో రిజర్వేషన్ పోరాట డ్రామా..
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కవితను అరెస్ట్ చేయవచ్చన్న వార్తలు రావడంతో.. తాను వీర నారిని అని.. తెలంగాణ మహిళ కళ్లలో నుంచి నీళ్లు రావు.. నిప్పులు వస్తాయి అని పెద్దపెద్ద డైలాగ్స్ చెప్పారు కేసీఆర్ తనయ. ఈ క్రమంలో కవితకు మహిళల హక్కులు సడెన్‌గా గుర్తొచ్చాయి. చట్ట సభల్లో మహిళలకు ప్రాతినిధ్యం దక్కడం లేదన్న బాధ కవితను కలచివేసింది. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి.. నాలుగున్నరేళ్లు మహిళా మంత్రి లేకుండా పాలన సాగించిన తండ్రిని ఒక్క మాట కూడా అడగని కవిత.. ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ కోసం ధర్నా చేశారు. మోదీ మెడలు వంచుతం.. మహిళా శక్తి చాటుతం అని ఈ ధర్నా వేదికపై కూడా డైలాగ్స్ చెప్పారు..
అప్పుడు లేసిన నోరు.. ఇప్పుడు లేవదే..
తన అరెస్ట్ వార్తల సమయంలో మహిళల హక్కులు, చట్టాలు, అంటూ కేంద్రంలోని మోదీ సర్కార్‌పై దుమ్మెత్తి పోసిన కవిత.. భారీ సెంటిమెంట్ డైలాగ్స్ చేసిన కేసీఆర్ కూతురు.. తాజాగా వాళ్ల నాయన ప్రకటించిన బీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై మాత్రం నోరు మెదపడం లేదు. ఈ జాబితాలో కేవలం ఏడుగురు మహిళలకే అవకాశం కల్పించారు. కవిత చెప్పినట్లు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే.. బీఆర్‌ఎస్ 37 మంది మహిళా అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలి. కానీ అందులో సగం కూడా మహిళలకు కేటాయించలేదు. అయినా కవిత మౌనం వహిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కవిత మాత్రం.. ఇంట మౌనంగా ఉండి.. తన వరకు వస్తే రచ్చ చేయడంలో మాత్రం ముందుంటున్నారు.
కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై ట్వీట్..
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో దొంగ దీక్షలు చేస్తారని, తెలంగాణలో మాత్రం 33 శాతం సీట్లు కేటాయించకుండా.. కేవలం 7 సీట్లే మహిళలకు కేటాయించారని కిషన్‌రెడ్డి విమర్శించారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై తాజాగా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. భారీ మెజారిటీ ఉన్నప్పటికీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ.. చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ మహిళలకు కేటాయించిన ఏడు సీట్లు ఇవే..
మొత్తం 115 స్థానాలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో ఏడుగురు మహిళలకే అకాశం కల్పించారు.
సబితా ఇంద్రారెడ్డి– మహేశ్వరం
పద్మా దేవేందర్‌రెడ్డి– మెదక్
గొంగిడి సునీత– ఆలేరు
కోవ లక్ష్మి– ఆసిఫాబాద్
బానోత్ హరిప్రియ నాయక్– ఎల్లందు
బడే నాగజ్యోతి– ములుగు,
జి.లాస్య నందిత– సికింద్రాబాద్ కంటోన్మెంట్