Ration Rice- Brewing Beer: రాష్ర్టంలో రేషన్ పక్కదారి పడుతోంది. పేదోడికి ఇచ్చే బియ్యం బీర్ల కంపెనీలకు, కోళ్ల ఫారంల దాణాకు మళ్లుతున్నది. దొడ్డు బియ్యం ఇప్పుడు తినేవారు కరువైండ్రు. ప్రభుత్వం ప్రతి నెలా రేషన్ కోసం రాష్ర్టం రూ. 700 కోట్లు సబ్సిడీ కింద ఖర్చు చేస్తున్నది. తెలంగాణలో 80 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డు దారులు ఉన్నరు. కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నది సర్కార్. ఇందులో చాలా వరకు బీర్ల తయారీ కంపెనీలకు, మరికొంత కోళ్ల ఫామ్ లకు దాణాలా.. ఇంకొంత హోటళ్ల నిర్వాహకులకు తరలుతుంది.

-వారే కీరోల్..
బీర్ల తయారీకి కూడా బియ్యం ఉపయోగించడం ఇప్పుడు రాష్ర్టంల హాట్ టాపిక్‌గా మారింది. బీర్ల తయారీ కంపెనీ దారులు, దాణా, తదితర బియ్యం కావలసిన వారు మిల్లర్లు, ఏజెంట్లతోనే డీల్ పెట్టుకుంటున్నరు. దీంతో వీరు గ్రామ స్థాయి నుంచి బియ్యంను సేకరిస్తున్నరు. ప్రతి రేషన్ దుకాణం వద్ద కాపు కాసి ఫ్రీ బియ్యాన్ని రూ. 9 నుంచి రూ. 10 ఇచ్చి కొనుక్కుంటున్నరు. ఇక రేషన్ లబ్ధిదారుల ఇంటికెళ్లి మరీ కిలోల లెక్కన కొంటున్నారు. ఇప్పుడు ఎవరూ దొడ్డు బియ్యం తినకపోవడం.. సన్నబియ్యమే తింటుడడంతో రేషన్ బియ్యంను ఎంతకోకొంతకు అమ్మేస్తున్నారు. ఈ బియ్యం అంతా రీ సైకింగ్ చేసి.. అవసరం ఉన్న వారికి రూ. 30 నుంచి రూ. 33 వరకు అమ్ముకుంటున్నరు.
-ప్రభుత్వం ఏం చేస్తున్నది..
ఇంత పెద్ద మొత్తంలో దందా కొనసాగుతుంటే పోశెట్టి సర్కార్ ఏం చేస్తున్నది అంటూ ప్రజలు మండిపడుతున్నరు. వచ్చిన బియ్యం వచ్చినట్లుగానే పక్కదారి పడుతుంటే మొద్దు నిద్ర పోతున్నదా అంటూ ప్రశ్నిస్తున్నరు. ఇక్కడ ప్రధానంగా చేతులు మారుతుందే తప్ప ఎక్కడా సక్రమంగా వినియోగించడం లేదంటూ విమర్శలు ఉన్నాయి. పేదల కోసం.. పేదలే ప్రాణం అన్న కేసీఆర్ గుప్పెడు మెతుకులు సన్నబియ్యమిస్తే ఖజానా ఖాళీ అవుతదా అంటూ ప్రశ్నిస్తున్నరు.

బియ్యాన్ని రీసైక్లింగ్ చేయడం చట్టరిత్యా నేరం.. అది మిల్లర్లకు తెల్వదా అంటూ ప్రశ్నల వర్షం కురుస్తున్నది. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ దందా సాగుతున్నదని తెలుస్తూనే ఉంది. అడపా దడపా పోలీసుల దాడుల్లో వేలాది క్వింటాళ్ల బియ్యం పట్టుబడుతున్నా ఎక్కడివి? ఎక్కడి నుంచి వచ్చినయి? ఎక్కడికి పోతున్నయి? పట్టించుకుంటలేదు సర్కార్. ఇక పట్టుబడిన బియ్యం కూడా మళ్లీ అదే గూటికి చేరుతుంది.
ఇక ఇప్పుడు బీర్ల తయారీకి బియ్యం అంటే పేదవాడు తలపట్టుకుంటున్నడు. మా కూటికాడి ముద్ద పెద్దోళ్లు గుంజుకుపోతున్నరని బాధపడుతున్నాడు. ఏది ఏమైనా బియ్యం దందాపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నరు.