KCR BRS: కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు, మోదీని దెబ్బకొట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్థాపించిన బీఆర్‌ఎస్ పార్టీకి బ్రేక్ బడబోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది ఎన్నికల సంఘం అధికారుల నుంచి బీఆర్‌ఎస్ పార్టీపేరుపై అభ్యంతరాలు తెలపాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవలే పబ్లిక్ నోటీసు ఇచ్చారు. నెల రోజుల గడువు విధించారు. గడుము ముగిసే చివరి రోజు ఆ పేరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. దీంతో పార్టీ ఆవిర్భావంపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి.

వరంగల్ నుంచి అభ్యంతరం..
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 5న దసరా సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్ జనరల్ బాడీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించేందుకు.. ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించింది. పార్టీ నియమావళిలో మార్పులు చేశామని టీఆర్‌ఎస్ స్పష్టం చేసింది. పార్టీ పేరు మార్పునకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ విషయంపై టీఆర్‌ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌రావు స్వయంగా సీఈసీని కలిసి దరఖాస్తు అందించారు. నెల రోజుల తర్వాత పేరు మార్పుపై పబ్లిక్ నోటీస్ ఇవ్వాలని ఎన్నికల సంఘం టీఆర్‌ఎస్‌కు లేఖ రాసింది. దీంతో నవంబర్ 7న టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్ గా మారుస్తూ.. టీఆర్‌ఎస్ పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. ఈ మేరకు అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో సెక్రటరీ (పొలిటికల్ పార్టీ), ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, అశోకా రోడ్, న్యూఢిల్లీ అడ్రస్‌కు కారణాలతో సహా అభ్యంతరాలను పంపాలని పబ్లిక్ నోటీసులో టీఆర్‌ఎస్ పేర్కొంది.
గడువుకు ఒక్కరోజు ముందు..
డిసెంబర్ 7తో గడువు ముగియనుంది. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన బానోత్ ప్రేమ్‌నాయక్ గడువుకు ఒక్క రోజు ముందు బీఆర్‌ఎస్‌పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఫిర్యాదు చేశారు. తాను పెట్టబోయే పార్టీకి బీఆర్‌ఎస్ అని పేరు ఖరారు చేయాలని మూడు నెలల క్రితమే దరఖాస్తు చేసుకున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తర్వాతనే టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ కేసీఆర్ నిర్ణయించారని, ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ముందు దరఖాస్తు చేసుకున్న తనకే బీఆర్‌ఎస్ పేరు ఇవ్వాలని కోరాడు.

ఆదిలోనే ఆటంకం..
తెలంగాణ ముఖ్యమంత్రికి ఆటంకాలు అధిగమించడం కొత్తకాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాని తెచ్చారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌పై అభ్యంతరాలను అధిగమిస్తారని గులాబీ నేతలు చెబుతున్నారు. కానీ, బీఆర్‌ఎస్‌పై వచ్చిన ఫిర్యాదును ఎన్నికల సంఘం ఎలా చూస్తుందనేది ఇప్పుడు కీలకం. కేంద్రం ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తుందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. సీఈసీ నియామకంపై ఇటీవలే సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు ఆదిలోనే ఎదురైన ఆటంకంపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఒకవేళ బీఆర్‌ఎస్‌ను తిరస్కరిస్తే.. ఎన్నికల సంఘం తీరును ఎండగట్టాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలిసింది.