YCP Candidate Final List: వైసీపీ ఎన్నికల టీమ్ రెడీ అవుతోంది., ఇప్పటికే ప్రభుత్వంతో పాటు పార్టీలో జగన్ కీలక మార్పులు చేశారు. ఏకంగా తన అస్మదీయులైన నాలుగురైదుగురు నేతలను సైతం తప్పించి కఠిన నిర్ణయాలు ఉంటాయని సంకేతాలిచ్చారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లను రీజనల్ కోఆర్డినేటర్ల బాధ్యతల నుంచి తప్పించారు. దాదాపు 8 జిల్లాల అధ్యక్షులను తప్పించి కొత్తవారిని నియమించారు. అటు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలను మూడు విడతల్లో వడబోస్తున్నారు. ఐప్యాక్ బృందం, సర్వే సంస్థలు, ప్రభుత్వ నిఘా సంస్థల నుంచి సేకరించిన వివరాలతో అభ్యర్థుల లిస్ట్ ను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతల తో జగన్ భేటీకి నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
JAGAN
వచ్చే ఎన్నికలే టార్గెట్ గా జరుగుతున్న సమావేశానికి పార్టీ ముఖ్య నేతలందరికీ సమాచారం అందింది. ఒక విధంగా చెప్పాలంటే పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి ఇవి డేంజర్ బెల్సే. ఇప్పటికీ ఉగాది నుంచి మూడుసార్లు వర్కు షాపు నిర్వహించిన జగన్ ఎమ్మెల్యేలకు రూట్ మ్యాప్ ఇచ్చి ప్రజల్లో ఉండాలని సూచించారు. ప్రజల్లో తిరగకుంటే మార్పు తప్పదని సంకేతాలిచ్చారు. 151 మంది ఎమ్మెల్యేల్లోతొలుత 70 మంది పనితీరు బాగాలేదని తొలి వర్కుషాపులో ఇంటర్నల్ గా బయటపెట్టారు. వారికి హెచ్చరికలతో కూడిన సంకేతాలిచ్చారు. దీంతో 70 గా ఉన్న జాబితా కాస్తా 27కు వచ్చింది. గత వర్కుషాపులో ఈ 27 మందికి జగన్ గట్టిగానే చెప్పారు. లాస్ట్ చాన్స్ అంటూ కొంత సమయమిచ్చారు. ఇప్పుడు వర్కు షాపునకు సిద్ధపడుతుండడంతో ఆ 27 మంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
అయితే ఎన్నడూ లేనంతగా పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విభేదాలు వెలుగుచూస్తున్నాయి. వాటిని పరిష్కరించి నేతల మధ్య సయోధ్య కుదర్చకపోతే పార్టీకి నష్టం తప్పదని ఇప్పటికే నిఘా వర్గాలు జగన్ ను హెచ్చరించాయి. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ అనంతరం విభేదాలు మరింత ముదిరియని.. అటువంటి చోట వాటికి చెక్ చెప్పకుంటే మొదటికి మోసం వస్తుందని భావిస్తున్నారు. పదవులు పోయాయని కొందరు..కొత్తగా పదవులు వచ్చాయని మరికొందరు పార్టీలో ఒకరకమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ప్రజా వ్యతిరేకతకు విభేదాలు తోడైతే మాత్రం మూల్యం తప్పదని జగన్ భావిస్తున్నారు. అందుకే ముందుగా వాటిపై ఫోకస్ పెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గ పరిశీలకులను నియమించారు. వీరిచ్చే ఫీడ్ బ్యాక్ పైనే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కేటాయింపులు జరిగే అవకాశాలున్నాయి.
JAGAN
జయహో బీసీ గర్జనతో జోరుమీదున్న పార్టీ హైకమాండ్ గురువారం జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో వేటు తప్పదని భావిస్తున్న కొంతమంది భవితవ్యం తేల్చనున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నాలుగేళ్లలో ఎన్నో రకాలుగా చెప్పి చూశానని.. వారిలో మార్పు రాలేదని.. ఇక మీ ఇష్టమంటూ కొంతమంది నేతల పేర్లు బయటపెట్టే అవకాశాలున్నట్టు చర్చ నడుస్తోంది. అయితే సీఎం జగన్ ఈపాటికే కొంత సంకేతాలు పంపించారని.. నేరుగా సమావేశంలో పేర్లు వెల్లడించే చాన్సే లేదని మరికొందరు వాదిస్తున్నారు. వచ్చే ఎన్నికలే అజెండగా సాగుతున్న సమావేశంలో మాత్రం వైసీపీ అంతర్గత విషయాలు బయటపడే చాన్స్ మాత్రం ఉన్నట్టు తెలుస్తోంది.