Rajnath Singh warning to Pakistan: ఈ మధ్య అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోతుంది. పాకిస్తాన్ దేశంలో విస్తారమైన వనరులను అమెరికా కంపెనీలకు కట్టబెట్టడం ఇటీవల విజయవంతంగా పూర్తయింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇటీవల అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో పాకిస్తాన్ దేశంలో లభ్యమవుతున్న అరుదైన వనరులను తవ్వే బాధ్యత అమెరికా కంపెనీలకు అప్పగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అందువల్లే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయనతో లంచ్ చేశారు. శ్వేత సౌధంలో ఏకాంతంగా మాట్లాడారు. ఆ తర్వాత పాకిస్తాన్ దేశాన్ని గొప్పగా కీర్తించారు. అమెరికా కంపెనీలు పాకిస్తాన్ దేశంలో అడుగుపెడితే చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే సామ్రాజ్యవాదానికి అమెరికా బలమైన ఉదాహరణ. అటువంటి అమెరికా పాకిస్తాన్లో అడుగుపెడితే.. ఏ ఒక్క సహజ వనరును కూడా వదిలిపెట్టకుండా తవ్వుకొని తీసుకెళ్తుంది. ఇంత బిచ్చం మొహం మీద వేసినట్టు.. పాకిస్తాన్ చేతిలో చిల్లర వేస్తుంది.
అమెరికా కంపెనీలు వస్తుండడం.. ట్రంప్ నుంచి బలమైన వర్తమానం అందడంతో పాకిస్తాన్ ఆనందానికి అవధులు లేవు. అందువల్లే మనతో యుద్ధం చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని.. తమను రెచ్చగొడితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరిస్తోంది. అంతేకాదు సింధు నది మీద భారత్ కడుతున్న ప్రాజెక్టులను నేలమట్టం చేస్తామని వార్నింగులు కూడా ఇస్తోంది.. వీటికి సరైన స్థాయిలోనే భారత్ బదులు చెప్పింది. తిక్క తిక్క వేషాలు వేస్తే తోకలు కత్తరిస్తామని హెచ్చరించి. ఇంకోసారి ఇలాంటి లేకి మాటలు మాట్లాడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గట్టు స్వరంతోనే కౌంటర్ ఇచ్చింది. అయితే ఇప్పుడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్ కు మరోసారి గట్టి హెచ్చరికలు పంపారు. ఈసారి ఏకంగా భస్మీ పటలం చేస్తామని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో రూపొందించిన తొలి విడత బ్రహ్మోస్ మిసైల్స్ ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “పాకిస్తాన్లోని ప్రతి అంగుళం మా బ్రహ్మోస్ మిసైల్స్ రేంజ్ లోనే ఉంది. ఆపరేషన్ సిందూర్ ద్వారా బ్రహ్మోస్ రేంజ్ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఆపరేషన్ సిందూర్ అనేది ట్రైలర్ మాత్రమే. దానిద్వారా మన శత్రువుకు సత్తా ఏమిటో చూపించాం. పాకిస్తాన్ దేశానికి జన్మనివ్వగలిగిన ఇండియా.. అవసరమైతే ఏమైనా చేస్తున్నారని నిరూపించింది. అందువల్లే పాకిస్తాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిది. అనవసరంగా మా దేశాన్ని గెలికితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని” కేంద్ర రక్షణ శాఖ మంత్రి హెచ్చరించారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి చేసిన హెచ్చరికల నేపథ్యంలో పాకిస్తాన్ దేశానికి మరో షాక్ తప్పదా అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ దేశం ఇప్పటికే అంతర్యుద్ధంతో ఇబ్బంది పడుతోంది. ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ సైనికులను దారుణంగా హతమార్చుతోంది. సరిహద్దుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ భీకరంగా కాల్పులు జరుపుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ దేశం పైకి భారత్ గనుక ఆపరేషన్ సిందూర్ లేదా సర్జికల్ స్ట్రైక్స్ ను చేపడితే పరిస్థితి మరో విధంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో భాగమయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.