Rasamayi vs Kavvampally: తెలంగాణలో నిన్నటిదాకా రాజకీయాలు మంత్రులు వర్సెస్ మంత్రులుగా కొనసాగాయి. ఇప్పుడు మరోవైపు టర్న్ తీసుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. నేతలు తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో అక్కడ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అంతేకాదు ఇందులోకి కీలకమైన ఆడియో ఫైల్స్ కూడా వెలుగులోకి రావడంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య విభేదాలు పెరిగిపోయాయి. వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటలు యుద్ధం సాగుతోంది. బాలకిషన్ ప్రస్తుత ఎమ్మెల్యే సత్యనారాయణ హెచ్చరిస్తున్న ఆడియో ఒకటి ఇటీవల కలకలం రేపింది. దీనికి కౌంటర్ గా ప్రస్తుత ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడినట్టు ఉన్న ఆడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది.. “మీడియా ప్రతినిధులు గౌరవాన్ని కాపాడుకోవాలి. వాడు ఏదో చెబుతుంటాడు మీరు అలానే రాస్తుంటారు.. వాడు హౌలా గాడు.. మీరేమైనా వాడికి పోస్ట్ మాన్ ఉద్యోగం చేస్తున్నారా.. ఖబర్దార్ రసమయి.. పోలీసులకు పోస్టింగులు ఇవ్వడానికి లంచం తీసుకున్నావ్.. ఒక సీఐ కోసం అప్పటి సీపీనే బదిలీ చేయించావు. డబ్బులు తీసుకున్నావ్ అనుకో మనకు గొంతు పెకలదు. పారదర్శకంగా మేము పరిపాలన చేస్తున్నాం. నువ్వేమో డబ్బుల కోసం ఆశ పడ్డావు. నేను చదువుకున్న రోజుల్లోనే విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించాను. టీచర్ ఉద్యోగం చేసిన నువ్వు దెబ్బలు తిన్న విషయాన్ని మర్చిపోయావా” అంటూ కవ్వంపల్లి రసమయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. ఆ ఆడియో లో ఉన్న మాటలు ఎమ్మెల్యే సత్యనారాయణవేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది మాత్రం ఎమ్మెల్యే మాట తీరును తప్పుపడుతున్నారు.. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో సత్యనారాయణ అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. తాజాగా రసమయి బాలకిషన్ ను ఉద్దేశించి చేసిన విమర్శలతో మరింత వివాదాన్ని మూట కట్టుకున్నారు. దీనిపై ఇంతవరకు గులాబీ పార్టీ నేతలు స్పందించలేదు. ఈ ఆడియో రసమయి దాకా వెళ్ళిందా? వెళ్తే ఆయన ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇదే చర్చ మానకొండూరులో జరుగుతోంది..
కొద్దిరోజుల క్రితం బాలకిషన్ మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. బాలకిషన్ ప్రస్తుత ఎమ్మెల్యే సత్యనారాయణను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో అవినీతి తారస్థాయికి చేరిందని.. కమిషన్ల బాగోతం అడ్డగోలుగా సాగుతోందని.. ప్రజాపాలన పేరుతో ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాలకిషన్ ఆరోపించారు. ఆ ఆరోపణల తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ రెస్పాండ్ అయ్యారు. ఈ స్థాయిలో ఆరోపణలు చేస్తూ బాలకృష్ణ మీద విరుచుకుపడ్డారు. మరి దీనికి బాలకిషన్ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాల్సి ఉంది.
