ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీలో ఎలాంటి విభేదాలు లేకపోయినా ప్రస్తుతం మళ్లీ కనిపిస్తున్నాయి. సీఎం జగన్ స్థానికంగా లేకపోవడం చూసి బొత్స సత్యనారాయణ తన ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యమంత్రి జగన్ సిమ్లా పర్యటనకు వెళ్లిన సందర్భంలో బొత్స అమరావతి రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీని వెనుక మతలబు ఏమిటని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
అమరావతిలో రైతులు గత 600 రోజులకు పైగానే ఆందోళనలు చేస్తున్నారు. బొత్స మాటల్లో పట్టించుకోవాల్సింది ఏమీ లేకపోయినా ఆయన ఎందుకు అలా మాట్లాడారో పార్టీ నేతలకు అంతుబట్టడం లేదు. ఆయన మాటల వెనుక అంతరార్థం ఏమిటి అనే దానిపై కూడా క్లారిటీ లేదు. దీంతో బొత్స మాటలకు పార్టీలో కూడా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మాటలను మీడియా కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో ఏపీలో వైరల్ అవుతోంది.
జగన్ వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన సందర్భంలో నేతలెవరు కూడా నిశ్శబ్దం పాటించాల్సి ఉన్నా బొత్స మాత్రం రైతుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటంలో ఆయన ఉద్దేశం ఏమిటన్నిది అంతుచిక్కడ లేదు. ఇప్పటికే ఆయన తరచు ఢిల్లీ వెళుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బొత్స ఏదైనా గూడుపుఠాణి చేస్తున్నారా అని అనుమానాలు వస్తున్నాయి. బొత్స తీరుపై పార్టీలో రకరకాల చర్చలు ప్రచారంలో సాగుతున్నాయి. బొత్స అసందర్భ ప్రేలాపణల వెనుక మర్మం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు.
గత కొద్ది రోజులుగా బొత్స సత్యనారాయణ విషయంలో పార్టీ కూడా పలు విధాలుగా అప్రదిష్ట పాలు చేయాలని చూస్తోందని పలు సంఘటనలు రుజువు చేశాయి. కొన్ని విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించే పని బొత్సకు అప్పగించినా తరువాత అది అబద్దమని పార్టీ సలహాదారు సజ్జల పలుమార్లు చెప్పడంతో ఆయనపై కావాలనే పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరిగాయని విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచే బొత్స కూడా అదను కోసం ఎదురు చూసినట్లు తెలుస్తోంది. అందుకే సమయం చూసి దెబ్బ కొట్టాలనే ప్రణాళికతోనే ఇలా చేశారని చెబుతున్నారు.