
Botsa Satyanaraya : ఉత్తరాంధ్రలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఏర్పడిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి స్థానానికి పోటీపడిన అతి కొద్ది మందిలో బొత్స సత్యనారాయణ ఒకరు. ఒకానొక దశలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం సీటు కోసం బలంగా పోటీపడ్డారు బొత్స. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా గుర్తింపు పొందిన ఆయనకు పార్టీలకు అతీతంగా మంచి పేరు ఉంది. మరి ముఖ్యంగా విజయనగరం జిల్లా రాజకీయాలను కను సైగలతో శాసించే శక్తి సామర్థ్యాలు బొత్స సొంతం. అటువంటి బొత్స సత్యనారాయణ ఇప్పుడు కుటుంబంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఎవరైనా చెబుతారు.. కానీ, బొత్సకు ఇప్పుడు ఇంట గెలవడమే సమస్యగా మారింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ పరమైన సమస్యలతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో కీలకమైన నేతగా ఎదగడంలో బొత్స కుటుంబ సభ్యులు అందించిన సహకారం ఎనలేనిది. ముఖ్యంగా బొత్స సత్తిబాబు మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను అన్నీ తానే వ్యవహరిస్తుంటారు. సత్తిబాబు విజయం వెనుక చిన్న శ్రీను కృషి ఎనలేనిది. సత్తిబాబు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. జిల్లాలో రాజకీయాలను చక్కబెట్టడంలో చిన్న శీను సిద్ధహస్తుడు అన్న పేరు ఉంది. మావయ్య ప్రాతినిధ్యం వహించే చీపురుపల్లి నియోజకవర్గంలో సత్తిబాబు విజయం సాధించేలా క్షేత్రస్థాయిలో పని చేయడం చిన్న శ్రీను బాధ్యతగా చూసుకుంటూ వస్తుండేవారు. బొత్స సత్యనారాయణ మంత్రిగా చేసినంతకాలం.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధికారాన్ని నేరిపినది చిన్న శ్రీను అని అందరికీ తెలుసు. దీంతో మూడు జిల్లాల్లో బలమైన నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నారు మజ్జి శ్రీనివాసరావు. సత్తిబాబు కంటే చిన్న శ్రీను దగ్గరికి వెళితే చాలు పని అవుతుంది అన్న భావన కేడర్లో పెరిగింది. కాంగ్రెస్ పార్టీలో పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు గాని, వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ళపాటుగాని మామా, అల్లుళ్ల మధ్య ఎటువంటి ఇబ్బందులు రాలేదు.
పెరిగిన దూరంతో ఇబ్బందులు తలెత్తేనా..
ప్రస్తుతం విజయనగరం జిల్లాలో మామా – అల్లుళ్ల మధ్య కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందని చెబుతున్నారు. ఇద్దరు నేతలు ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్నారని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇది పార్టీకి ఇబ్బందులు కలిగించే అంశంగా నాయకులు భావిస్తున్నారు. ఇద్దరూ విడిపోయినట్లయితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. కేడర్లో బలమైన ముద్ర వేసుకున్న చిన్న శ్రీనును కాదని బొత్స సత్తిబాబు ఏమి చేసే పరిస్థితి ఉండదని, అలాగని బొత్స సత్తిబాబుకు దూరమై రాజకీయాలు చేసే పరిస్థితి చిన్న శ్రీనుకు ఉండదని పలువురు నాయకులు పేర్కొంటున్నారు.
సమస్యకు కారణం ఏమిటో తెలియదు..
బొత్స సత్తిబాబు – చిన్న శ్రీనివాసరావు మధ్య వివాదం ఏమిటన్న విషయముపై ఎవరికి స్పష్టత లేదు. అసలు వివాదం ఉందా లేదా అన్నది కూడా తెలియదు. కానీ గతంలో మాదిరిగా మామ – అల్లుళ్ళ మధ్య సఖ్యత అయితే లేదు. ఇది మాత్రం జిల్లా వైసీపీ శ్రేణులు బలంగా చెబుతున్నారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన అగాధాన్ని.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. సభలు, సమావేశాల్లో కలిసే వేదికలు పంచుకుంటున్నా.. ఎక్కడో ఒక చోట కార్యకర్తల్లో మాత్రం అనుమానం వేధిస్తోంది.
బరిలో దిగేందుకు యత్నిస్తున్న చిన్న శ్రీను..
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మజ్జి శ్రీనివాసరావు.. ప్రస్తుతం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడుగానూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో శాసనసభలో అడుగు పెట్టాలని భావిస్తున్న ఆయన.. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లాలోని ఎస్ కోట, చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నుంచి పోటీ చేసే ఆలోచనలో శ్రీనివాస రావు ఉన్నారు. మామయ్య బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బరిలో దిగితే మాత్రం మరోచోట నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. మామయ్య కాకుండా ఆయన కుమారుడు సందీప్ ను బరిలోకి దించాలని భావిస్తే మాత్రం.. ఆ సీటు తనకు కావాలని శ్రీనివాసరావు బలంగా కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలోనూ క్యాడర్ ను సంసిద్ధం చేసే పనిలో చిన్న శ్రీను ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే మిగిలిన నియోజకవర్గాలపైనా తనదైన శైలిలో రాజకీయ చతురతను కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు మజ్జి శ్రీనివాసరావు. ఏది ఏమైనా విజయనగరం జిల్లా రాజకీయాలను గడిచిన రెండు దశాబ్దాలుగా శాసిస్తున్న బొత్స సత్యనారాయణకు.. ఇప్పుడు ఇంట పోరు కొంత సమస్యగా మారిందని చెబుతున్నారు.