https://oktelugu.com/

Botsa Jhansi Lakshmi: బొత్స ఝాన్సీలక్ష్మి పొలిటికల్ రీ ఎంట్రీ? ఏ పార్టీ నుంచి అంటే?

మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు ప్రధానంగా వినిపించింది. అనకాపల్లి ఇన్చార్జి బాధ్యతలను వేరొకరికి అప్పగించడం, అమర్నాథ్ ను రిజర్వులో పెట్టడంతో.. కచ్చితంగా విశాఖ లోక్ సభ స్థానం కోసమేనని టాక్ నడిచింది.

Written By:
  • Dharma
  • , Updated On : January 8, 2024 / 12:26 PM IST
    Follow us on

    Botsa Jhansi Lakshmi: విశాఖ పార్లమెంట్ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆర్థిక, అంగ, సామాజిక బలంతో పాటు స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకొని వైసిపి హై కమాండ్ కొత్త అభ్యర్థి కోసం జల్లెడ పడుతోంది. గత ఎన్నికల్లో ఎంవివి సత్యనారాయణ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కానీ ఈసారి ఆయన శాసనసభ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఆయనకు విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి ఆయన పోటీ చేయనున్నారు. దీంతో విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలో కొత్త అభ్యర్థి కోసం వైసిపి అన్వేషిస్తోంది. రకరకాల పేర్లు వస్తున్నా.. ఫైనలైజ్ చేయలేకపోతోంది.

    మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు ప్రధానంగా వినిపించింది. అనకాపల్లి ఇన్చార్జి బాధ్యతలను వేరొకరికి అప్పగించడం, అమర్నాథ్ ను రిజర్వులో పెట్టడంతో.. కచ్చితంగా విశాఖ లోక్ సభ స్థానం కోసమేనని టాక్ నడిచింది. అయితే దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ మనుమడు శ్రీవాత్సవ్ పేరు సైతం వినిపిస్తోంది. ద్రోణం రాజు శ్రీనివాస్ అకాల మరణంతో శ్రీ వాత్సవ్ తెరపైకి వచ్చారు. వైసీపీలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి ఎంపీ టికెట్ ఖాయమని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బొత్స ఝాన్సీ లక్ష్మి పేరు తెర మీదకు రావడం విశేషం.

    సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మికి రాజకీయ అనుభవం కూడా ఉంది. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు బొబ్బిలి, విజయనగరం ఎంపీగా కూడా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో సైలెంట్ అయ్యారు. 2024 ఎన్నికల్లో ఆమె సేవలను వినియోగించుకోవాలని వైసిపి భావిస్తోంది. ఆంధ్రా యూనివర్సిటీలో డాక్టరేట్ చేసిన ఆమె విద్యాధికురాలు కూడా. గతంలో నిర్వర్తించిన పదవుల్లో ఆమె రాణించారు. అందుకే ఆమె ఈసారి విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికే బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి ఎన్నికై మంత్రిగా ఉన్నారు. మరో సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో సమీప బంధువు బడ్డుకొండ అప్పల నాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా, మేనల్లుడు చిన్న శ్రీను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. ఇన్ని పదవుల మధ్య కొత్తగా ఝాన్సీ లక్ష్మికి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

    అయితే నాన్ లోకల్ కోట కింద విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి ఝాన్సీ లక్ష్మి పోటీ చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని వైసిపి హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో కాపు సామాజిక వర్గం అధికం. పైగా కూతవేటు దూరంలో విజయనగరం ఉంటుంది. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. విశాఖలో నివాసం ఉంటున్నారు. అందుకే ఆమె స్థానికురాలిగా భావించి టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. త్వరలో ఝాన్సీ లక్ష్మీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.