రాజకీయంలో ఓ పదవి కావాలంటే ఒకటి అందుకు తగినట్లుగా రాజకీయం తెలిసైనా ఉండాలి.. లేదా పార్టీ ముఖ్యులకు అనుయాయులైనా ఉండాలి. అటు రాజకీయం తెలియక.. ఇటు ముఖ్యనేతలకు దగ్గరగా లేకుండా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తామంటే నడవదు. సరిగా ఇలాంటి రాజకీయాలు చేసి బోల్తా పడ్డాడు ఓ ఎమ్మెల్యే. మంత్రి పదవి కోసం ఏకంగా ప్రతిపక్ష ఎంపీతో కలిసిపోయి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు దిగాడు. కానీ.. అవి వర్కవుట్ కాకపోవడంతో నాలుక కరుచుకున్నాడు. తీరా ఇప్పుడు అధికార పార్టీ మంత్రం జపిస్తున్నాడు.
Also Read : ప్రేమ.. పగ.. యాసిడ్ దాడి..మగాళ్లు జాగ్రత్త.. ఆడోళ్లు ‘పోసేస్తున్నారు’..!
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్. ఆయన తీరు చాలా డిఫరెంట్. ఏం చేసినా ప్రచారంలో ఉండాలనుకుంటాడు. కొన్ని సార్లు అది వివాదస్పదం కూడా అవుతుంటుంది. కానీ.. వాటిని పట్టించుకోడు. తాజాగా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. మంత్రి పదవి కోసం కుటిల ప్రయత్నాలు చేసి భంగపడ్డాడు. అసంతృప్తి రాగం వినిపించే ప్రయత్నం చేశాడు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉండటం లేదని సంచలన కామెంట్స్ చేశాడు. షకీల్ టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మైనార్టీ కోటాలో రెండుసార్లు గెలిచారు. పైగా పార్టీలో ఉన్న ఏకైక ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడే మైనారిటీ కోటాలో మంత్రి అవుతానని కలలుగన్నాడు. రెండోసారి గెలిచాను కదా ఈసారి తప్పకుండా మంత్రి పదవి తనకు వస్తుందని అనుకున్నాడు. కానీ.. ఆ కల కలగానే ఉండిపోయింది. అధిష్ఠానం తన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో అప్పటి నుంచి పార్టీకి, ఆయనకు మధ్య గ్యాప్ పెరిగిందని టాక్.
ఎలాగైనా తనకు మంత్రి పదవి దక్కాలని అనుకున్నాడో ఏమో షకీల్ ఈసారి గేర్ మార్చారు. ఏకంగా ప్రత్యర్థి పార్టీ ఎంపీతో భేటీ అయ్యి రాజకీయవర్గాల్లో చర్చకు కారణమయ్యారు. పార్టీ మారిపోతారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో పార్టీలోని కీలక నేత మాట్లాడటంతో షకీల్ శాంతించారనే టాక్ నడిచింది. కానీ.. ప్రత్యర్థి పార్టీ నాయకులతో కలిసి ఆ పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రం ఆపలేదు. అయితే టీఆర్‌ఎస్ అధిష్ఠానాన్ని బ్లాక్ మెయిల్ చేసేందుకే ఈ ఎత్తుగడలని కొందరు భావించారు. ఇదే సమయంలో షకీల్ కదలికలపై పార్టీ పెద్దలు ఓ కన్నేశారు. పరిస్థితులు బాగాలేవని అనుకున్నారో ఏమో తర్వాత సైలెంట్ అయ్యారు.
Also Read : ఏపీ-తెలంగాణ మధ్య అంతర్యుద్ధం?
తాజాగా ఆయన రూట్ మార్చేశారు. సడెన్‌గా టీఆర్‌ఎస్ జపం మొదలుపెట్టారు. పార్టీలో కీలక నేతకు దగ్గరగా ఉన్న ఓ ఎమ్మెల్యే తనకు బాగా క్లోజ్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. కీలక నేతకు దగ్గరవడం ఎలా అన్న దానిపై ఆ ఎమ్మెల్యే వద్ద షకీల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లు సమాచారం. అందుకే ఆగస్టు 15న సదరు నేతను పొగడ్తలతో ముంచెత్తారని రాజకీయాల వర్గాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ వ్యాఖ్యల వీడియో కాస్తా వైరల్ కావడంతో టీఆర్‌ఎస్‌లో చర్చ మొదలైంది. ఎమ్మెల్యే షకీల్ జిమ్మిక్కులను ఆ నేత అంత తొందరగా నమ్మబోరని అంటున్నారట. అయినా షకీల్ మాత్రం.. ఆయన ముఖ్యమంత్రి అయితే తనకు మంత్రి పదవి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట.