Pawan Kalyan: ‘మనిషన్నక కాస్తా కళాపోషణ ఉండాలి’ ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు పలికే పవర్ ఫుల్ డైలాగు ఇది. ఆయన మేనరిజానికి తగ్గట్టు ఇప్పిటికీ ఈ డైలాగుకు తెలుగునాట ప్రాచుర్యంలోనే ఉంది. మనిషి ఏదో సందర్భంలో ఈ డైలాగును వాడుతునే ఉంటారు. ఇప్పడు పవన్ విషయంలో వైసీపీకి చెందిన నీలి మీడియాకు ఈ డైలాగ్ వర్తిస్తుందనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ అన్ని విషయాల్లో క్లారిటీగా ఉంటారు. తన రాజకీయ విధానం గురించి కూడా ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తుంటారు. తాను మార్పుకోసమే రాజకీయాల్లోకి వచ్చానని.. పదవుల కోసం కాదని సైతం చెబుతుంటారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తుంటారు. సామాజిక రుగ్మతలపై కూడా ప్రసంగాలు చేస్తుంటారు. సహజంగా ఇటువంటివి వైసీపీ నేతలకు నచ్చవు. మొన్నటికి మొన్న మంత్రి అంబటి రాంబాబు ఎందుకులే చేనేత వస్త్రాల ప్రసంగాలు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దానిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. పవన్ విషయంలో వారిలో ఉన్న కడుపు మంట. చివరకు పవన్ వేసుకున్న చేనేత వస్త్రాలు కూడా నచ్చవన్న రీతిలో మాట్లాడుతుంటే..ఇక నీలి మీడియా గురించి చెప్పమంటారా? వాస్తవానికి పవన్ కు ఏ మీడియా కూడా సపోర్టు లేదు.నీలి మీడియా మాత్రం అయినదానికి..కానిదానికి పవన్ ను ఆడి పోసుకుంటుంది. ఆయన్ను ఒక అజ్ఞానిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. తిరుపతి వేదికగా జనవాణి కార్యక్రమంలో ఆయన పరిణితితో మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలను ప్రతిబింబించేలా వ్యాఖ్యలు చేశారు. కానీ అవి అజ్ఞానంతో కూడినవిగా అభివర్ణించే ప్రయత్నంలో నిలీ మీడియా ఉండడం దురదృష్టకరం.
వాటిపై అభ్యంతరాలు..
తాను ఒక కులానికికానీ.. మతానికి కానీ కొమ్ముకాయను అని పవన్ వ్యాఖ్యానించారు. ఒక సామాజికవర్గం ఓట్లను టీడీపీకి గుంపగుత్తిగా అమ్మేస్తాననడంలో నిజం లేదు అని చెప్పుకొచ్చారు. ఇది అనవసరంగా తనపై దుష్ప్రచారం చేయడమేనన్నారు. తాను టీడీపీకానీ, వైసీపీకి కానీ కొమ్ముకాయనని చెప్పారు. విధ్వంసకర పాలనను ఎదుర్కొనేందుకు అవసరమైతే శత్రువుతో చేయి కలుపుతానని చెప్పుకొచ్చారు. ఇంతవరకూ ఎవరితో కలిసి పోటీచేస్తానో నిర్ణయించుకోలేదన్నారు. ప్రజా వ్యతిరేక పాలనను అవలంభిస్తున్న వైసీపీ రాకూడదనేదే తమ అభిమతంగా చెప్పుకొచ్చారు. దీనిపై నీలిమీడియా రకరకాల కథనాలు వండి వార్చుతోంది. వైసీపీ, టీడీపీకి కొమ్ముకాయనని చెబుతునే అవసరమైతే శత్రువుతో చేతులు కలుపుతానని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తోంది.ఇంకా ఎవరితో కలిసి నడవాలో నిర్ణయించుకోలేదని చెప్పడంపై కూడా నీలిమీడియా అభ్యంతరాలు తెలుపుతోంది. అయితే పవన్ ఈ విషయంలో స్పష్టంగా చెప్పారు. విధ్వంసకర పాలన చేస్తున్న వైసీపీని అడ్డుకోవడానికి అవసరమైతే శత్రువుతో చేతులు కలుపుతానని సంకేతాలిచ్చిన తరువాత కూడా పవన్ ఎవరితో కలిస్తే వారికి అభ్యంతరం ఏమిటో తెలియడం లేదు.
నాటి పరిస్థితి చెప్పినా..
2014లో ప్రత్యామ్నాయం లేకే కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని పవన్ స్పష్టం చేశారు. దీనిపై కూడా నీలి మీడియా తప్పుడు ప్రసారాలు చేస్తోంది. అంటే ప్రధాని మోదీ చెబితే చంద్రబాబుకు సపోర్టు చేశారా? లేక చంద్రబాబు సూచన మేరకు మోదీకి మద్దతు తెలిపారా? అని అర్ధం పర్థం లేని ప్రశ్నలు వేస్తోంది. ఒక రాజకీయ పార్టీ నేతగా మీకు సొంత అభిప్రాయాలుండవా? అంటూ కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తోంది. నాడు ఉన్న పరిస్తితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్టు పవన్ చెప్పినా పరిగణలోకి తీసుకోవడం లేదు. కేవలం పవన్ ఈమేజ్ ను డేమేజ్ చేయడానికే నీలిమీడియా ప్రయత్నం చేస్తోంది. మొత్తానికైతే నీలి మీడియాకు తెలియని కలవరం ఏదో వెంటాడుతోంది. పవన్, టీడీపీ, బీజేపీ చుట్టూ కథనాలు వండి వార్చుతోంది. వైసీపీని అడ్డుకుంటామన్న పవన్ హెచ్చిరికనే హైలెట్ చేస్తోంది.