Gujarat Election Result 2022: గుజరాత్ లో బిజెపి ఘనవిజయం సాధించింది. కనివిని ఎరుగని స్థాయిలో సీట్లను సాధించింది. 27 ఏళ్లుగా గుజరాత్ రాష్ట్రాన్ని పాలిస్తూ.. ఇప్పుడు మరో ఐదేళ్లు పాలించేందుకు ప్రజల నుంచి ఓటు ద్వారా అనుమతి తెచ్చుకుంది.. ప్రస్తుతం ఐదేళ్లు పాలిస్తేనే ప్రజల నుంచి ఎంతో కొంతో వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో కొంతమంది ముఖ్యమంత్రులు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సందర్భాలు కూడా మన దేశంలో ఉన్నాయి. 2018లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేకత నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ప్రతిపక్షాల అనైక్యత వల్ల ఘన విజయం సాధించారు. ఈ విషయం అటు ఉంచితే ప్రస్తుతం దేశంలో సుదీర్ఘ కాలం పాటు కొన్ని ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ తరహా రాజకీయం కొనసాగుతోంది. బెంగాల్ రాష్ట్రంలో 34 ఏళ్ల పాటు సిపిఎం ఏకధాటిగా పాలించి రికార్డు సృష్టించింది. ఆ రికార్డుకు చేరువగా బిజెపి వెళ్తోంది. ఇప్పటికే 27 ఏళ్లుగా గుజరాత్ రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉంది.. మరో ఐదేళ్ల పాలనకు మార్గం సుగమం చేసింది

2001లో ప్రారంభం
గుజరాత్ రాష్ట్రంలో 2001 నుంచి బిజెపి పాలిస్తోంది. అంతకుముందు కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అనాసక్తి నెలకొన్న వేళ కేశు భాయ్ పటేల్ నేతృత్వంలో 1995లో భారతీయ జనతా పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. తొలి నాళ్లల్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆ తర్వాత ఆ పార్టీ తొలి రెండు సంవత్సరాలలో ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చింది. అనంతరం రాజకీయ పరిణామాలు మారిపోవడంతో అక్కడ 27 రోజుల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగింది.. ఆ తర్వాత వచ్చిన రాష్ట్రీయ జనతా పార్టీ 1996 నుంచి 1998 వరకు పరిపాలించినప్పటికీ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరచలేకపోయింది. 2001 అక్టోబర్ 7న ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ తనదైన వ్యూహాలతో గుజరాత్ రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఏడాది ప్రారంభంలో భారీ భూకంపంతో అల్లాడి పోయిన రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దారు. వాటితోపాటు వ్యవసాయం, విద్య, విద్యుత్ రంగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీంతో మోడీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. అప్పటి నుంచి 2017 వరకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ… మోడీ తన వ్యూహ చతురతతో బిజెపిని గెలిపిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు వరుసగా ఏడుసార్లు గెలిచిన పార్టీగా బిజెపి నిలిచింది.
అప్పుడు కమ్యూనిస్టులు, ఇప్పుడు మమతా బెనర్జీ
1960, 1970 దశకంలో రాజకీయ అస్థిరతను ఎదుర్కొన్న పశ్చిమ బెంగాల్ కు జ్యోతి బసు మార్గదర్శిగా నిలిచారు. 1977లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 23 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలించిన నేతగా రికార్డ్ సృష్టించారు.. 2000 సంవత్సరంలో బాధ్యతల నుంచి వైదొలిగిన ఆయనకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ దానిని తిరస్కరించారని సన్నిహితులు చెబుతుంటారు. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బుద్ధదేవ్ భట్టాచార్య మరో 10 సంవత్సరాలు అధికారాన్ని నిలబెట్టారు.. తంగా 34 సంవత్సరాల పాటు పరిపాలించి కమ్యూనిస్టులు రికార్డ్ సృష్టించారు. ప్రభుత్వ వ్యతిరేకతను తన వైపు మళ్ళించుకున్న మమతా బెనర్జీ 2011లో ముఖ్యమంత్రిగా విజయం సాధించారు.. 2016, 2021 ఎన్నికల్లో విజయం సాధించి.. బెంగాల్ బెబ్బులి అనిపించారు.

ఈశాన్యంలో ఆణిముత్యం
ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర కూడా 20 ఏళ్ల పాటు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉంది.. 1978 నుంచి 1988 వరకు సీపీఎం తరఫున నృపెన్ చక్రవర్తి త్రిపుర ముఖ్యమంత్రిగా కొనసాగారు.. తర్వాత ఒక దఫా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనంతరం 1993లో మళ్లీ అధికారం చేపట్టిన సిపిఎం 23 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగింది.. 1998 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో మాణిక్ సర్కార్ విజయం సాధించారు.. మొత్తం 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన రికార్డు సృష్టించారు. 2018 ఎన్నికల్లో పీఠాన్ని చేజిక్కించుకున్న భారతీయ జనతా పార్టీ…2022 లోనూ విజయం సాధించింది.
సిక్కింలో పవన్
ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం లో 1994లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన పవన్ కుమార్ చామ్లింగ్ వరుసగా ఐదు సార్లు విజయం సాధించారు. శాంతి, అభివృద్ధి వంటి వ్యూహాలతో ముందుకు వెళ్లి 24 సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పాలించారు.. కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికల్లోనూ స్పష్టమైన మెజారిటీతో ముఖ్యమంత్రిగా కొనసాగారు.. దేశంలో అత్యధిక కాలం ఈ బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తిగానూ చామ్లింగ్ నిలిచారు. 2019 ఎన్నికల్లో సిక్కిం క్రాంతి కార్ పార్టీ విజయం సాధించడంతో పవన్ సీఎం పీఠానికి దూరమయ్యారు..
ఒడిశా కు మకుటం లేని మహారాజు

ఒడిశాలో వరుసగా మూడోసారి బిజూ జనతాదళ్ అధికారంలో కొనసాగుతోంది. తన తండ్రి ద్వారా రాజకీయ వారసత్వాన్ని పొందిన నవీన్ పట్నాయక్ ఇప్పటివరకు ఐదు సార్లు వరుసగా విజయం సాధించారు.. 2000 సంవత్సరంలో ఒడిశా 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. జాతీయ పార్టీలను ఎదుర్కొంటూ విజయవంతమైన పాలన అందిస్తున్నారు. పేదరికం, నిరుద్యోగం, వరుస తుఫాన్లు, నిరక్షరాస్యత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఆయన ఒడిశా ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు..