BJP: భారతీయ జనతా పార్టీ అంతరంగం అంతుచిక్కడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి వైఖరి సొంత పార్టీ శ్రేణులను విస్మయ పరుస్తోంది.తెలంగాణలో దూకుడుగా ఉన్న బండి సంజయ్ నాయకత్వాన్ని మార్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈటెల రాజేందర్ కు సైతం కీలక పదవి ఇచ్చారు. గతం కంటే బిజెపి పరిస్థితి మెరుగుపడిందా? అంటే అది కనిపించడం లేదు. ఎన్నికల సమీపించే కొద్దీ పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారుతోంది. ఇక ఏపీలోనూ అదే పరిస్థితి. అదే కన్ఫ్యూజన్. రెండు చోట్ల అధికార పార్టీతో లోపయికారీ ఒప్పందం చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో బండి సంజయ్ మార్పు తర్వాత అద్భుతాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. అధికార బి ఆర్ ఎస్, విపక్ష కాంగ్రెస్ నుంచి బడా నేతలు క్యూ కడతారని ప్రచారం చేసుకున్నారు. కానీ మూడు నెలలు అవుతున్నా ఒక్కడంటే ఒక్క పెద్ద నేత సైతం చేరలేదు. గ్రౌండ్ లెవెల్ లో ఇతర పార్టీలో అవకాశం దక్కని వారు మాత్రమే బిజెపిలోకి వస్తున్నారు. అన్నింటికీ మించి బిజెపి నుంచి కీలక నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం తెలంగాణలో రెండో స్థానం వస్తాది అనుకున్నారు.. కానీ కనీసం మూడో ప్లేస్ లో ఎక్కడ ఉంటుందో తెలియని స్థితిలో బిజెపి ఉంది. ఈ తరుణంలో తెలంగాణ ఎన్నికల కోసం ఓ జుంబో కమిటీని ఏర్పాటు చేశారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన బిజెపి కీలక నాయకులు, కేంద్ర మంత్రులతో బిజెపి హై కమాండ్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన తీరు, అభ్యర్థుల ఎంపిక, ఎలక్షన్ క్యాంపెయిన్ వంటి వాటిపై ఈ కమిటీ దృష్టి పెట్టనుంది. ఏపీ నుంచి బిజెపి మాజీ అధ్యక్షుడు సోమ వీర్రాజుకు ఈ కమిటీలో స్థానం దక్కడం విశేషం. అటు కర్ణాటక, తమిళనాడు, గోవాల నుంచి బిజెపి నాయకులకు ఈ కమిటీలో స్థానం దక్కింది. తెలంగాణ ఎన్నికల కమిటీలు ఇతర రాష్ట్రాల నాయకులకు చోటు ఇవ్వడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ ని తప్పించారు. ఆయన హయాంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలోపేతం అయిందని ఒక టాక్ ఉండేది. వచ్చే ఎన్నికల్లో అధికారానికి వచ్చే అవకాశం ఉందని.. లేకుంటే ప్రధాన పత్రి పక్ష స్థానం అయినా దక్కే ఛాన్స్ ఉందని టాక్ నడిచింది. కానీ అనూహ్యంగా బండి సంజయ్ ను తప్పించి జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. ఏపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజును తప్పించారు. ఆయనకు మాత్రం మొండి చేయి చూపారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కమిటీలో సోము వీర్రాజుకు తీసుకున్నారు. బండి సంజయ్ ను ఎలా వినియోగించుకుంటారో తెలియడం లేదు. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడుతొందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.