Telangana BJP: కమలం వారసత్వ రాజకీయాలకు బీజేపీ దూరంగా ఉంటుంది. ముఖ్యమంగా నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయ్యాక కమలంలో వారసత్వ రాజకీయాలు పూర్తిగా నిలిచిపోయాయి. వారసత్వ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మోదీ పోరాడుతున్నారు. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా తెలంగాణ బీజేపీ వారసత్వ రాజకీ యాలకు వేదికగా మారుతోంది. వారసత్వ పాలన అంటూ ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్న ఆ పార్టీలోనూ వారసత్వ కల్చర్ మొదలైంది. తెలంగాణ బీజేపీ నేతలు తమ వారసులకు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
వారసుల కోసం బిగ్ ఫైట్..
వారసుల కోసం బీజేపీలో బిగ్ ఫైట్ నడుస్తోంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్‌రెడ్డికి మహబూబ్‌నగర్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మొన్నటివరకు మిథున్ కోసం షాద్‌నగర్ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే హైకమాండ్ ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వడం కురదని తేల్చి చెప్పింది. దీంతో జితేందర్‌రెడ్డి తాను లోక్‌సభకు పోటీ చేయాలనుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. తద్వారా తన కొడుకుకు మహబూబ్‌నగర్ టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి విన్నవించారు. కొడుకు కోసం తన సీటునే త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఇక డీకే అరుణ తన కూతురి కోసం గద్వాల సెగ్మెంట్‌ను కోరుతున్నారు. డీకే అరుణ… నారాయణపేట నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. బీజేపీ సీనియర్ నేత, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా తన కూతురు విజయలక్ష్మికి ముషీరాబాద్ టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు.. వేములవాడ టికెట్ తన కొడుకు వికాస్‌రావుకు ఇ వ్వాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
వారసులకు హైకమాండ్ నో
అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ హైకమాండ్ వారసులకు నో చెప్పాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీలకు ఏ మా త్రం చాన్స్ ఇవ్వొద్దని నిర్ణయం తీసుకుం దని చెబుతున్నారు. మొన్నటివరకు ప్రత్యర్థి పార్టీలో కుటుంబ, వారసత్వ పాలన అం టూ బీజేపీ విమర్శలు చేసింది. ఇప్పుడు కుటుంబ పార్టీ అని తమపై విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే.. బీజేపీ సీనియర్ నేతలనే బరిలో దిగాలని సూచిస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
సెకండ్ లిస్ట్‌లో ఒకే ఒక్కడు..
ఇదిలా ఉండగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తన వారసుడు మిథున్‌రెడ్డికి టికెట్ కావాలని ఆయన చేసిన ఒత్తిడికి బీజేపీ అధిష్టానం తలొగ్గింది. అయితే ఇందుకోసం జితేందర్‌రెడ్డి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈమేరకు బీజేపీ తాజాగా సెకండ్ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో జితేందర్‌రెడ్డి తనయుడు మిథున్‌రెడ్డి పేరు మాత్రమే ఉంది. మహబూబ్‌నగర్ టికెట్ మిథున్‌రెడ్డికి కేటాయిస్తూ రెండో జాబితా ప్రకటించింది.
మూడో జాబితాలో మరో ముగ్గురు వారసులు..
ఇదిలా ఉంటే.. మూడో జాబితాలో మరో ముగ్గురు వారసులకు కూడా లైన్ క్లీయర్ అవుతుందని భావిస్తున్నారు. వారసులకు ఇవ్వకూడదని నిర్ణయించుకున్న హైకమాండ్ జితేందర్‌రెడ్డి తనయుడి విషయంలో పట్టువిడుపు ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో డీకే.అరుణ కూతురు, దత్తాత్రేయ తనయతోపాటు, విద్యాసాగర్‌రావు తనయుడికి కూడా టికెట్ వస్తుందని భావిస్తున్నారు. అయితే డీకే.అరుణ బరిలో నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమో అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దత్తాత్రేయ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. విద్యాసాగర్‌రావు పోటీకి ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో అరుణ తీసుకునే నిర్ణయంపైనే ఆమె కూతురుకు టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తల్లి, తండ్రిని కాదని వారసులకు టికెట్ ఇవ్వడం ద్వారా విపక్షాల ఆరోపణలు తిప్పొ కొట్టవచ్చన్న ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. అందుకే వారసులకు ఇవ్వాలంటే, పెద్దలు తప్పుకోవాలన్న కండీషన్ పెట్టినుట్ల తెలుస్తోంది.