Balineni Srinivasa Reddy: బాలినేని బిగ్ డెసిషన్.. వైసీపీని వీడడం ఖాయమా?

ఇటీవల సీఎం జగన్ తల్లి విజయమ్మ బాలినేని ఇంటికి వెళ్లారు. వైవి సుబ్బారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తోడల్లుళ్లు. అటు వైవి సుబ్బారెడ్డి సోదరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భార్య. దీంతో వీరంతా సమీప బంధువులు.

Written By: Dharma, Updated On : October 27, 2023 2:56 pm

Balineni Srinivasa Reddy

Follow us on

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వైసీపీ నాయకత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే సీఎంవో కు వెళ్లి వచ్చారు. కానీ ఆయనకు సీఎం జగన్ ముఖం చాటేశారు. అయితే జగన్ కావలిసే దూరం పెట్టారని.. బాలినేని వేరే పార్టీ నేతలకు టచ్ లో వెళ్లడం తెలుసుకున్నారని.. ఆయన్ను వదులుకోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీని వీడితే బాలినేని ఒక్కరే కాదు.. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తో పాటు మరో ఇద్దరు కీలక నాయకులు సైతం అదే బాట పట్టనున్నారని టాక్ నడుస్తోంది.

ఇటీవల సీఎం జగన్ తల్లి విజయమ్మ బాలినేని ఇంటికి వెళ్లారు. వైవి సుబ్బారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తోడల్లుళ్లు. అటు వైవి సుబ్బారెడ్డి సోదరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భార్య. దీంతో వీరంతా సమీప బంధువులు. అయితే ఇప్పుడు ఒక్క వైవి సుబ్బారెడ్డి తప్పించి.. మిగతా నాయకులందరినీ జగన్ దూరం పెట్టడం విశేషం. ఈ తరుణంలోనే తనను కలిసిన విజయమ్మ ఎదుట బాలినేని కన్నీరు పెట్టుకున్నారని తెలుస్తోంది. అటు విజయమ్మ సైతం జగన్ తీరు సరిలేదని.. తమను సైతం ఇబ్బంది పెడుతున్నాడని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితి చూస్తుంటే బాలినేని వైసీపీని వీడడం ఖాయంగా తెలుస్తోంది.

బాలినేని శ్రీనివాస్ రెడ్డికి, వై వి సుబ్బారెడ్డి కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి ఉంది. అయితే సీఎం జగన్ వైవి సుబ్బారెడ్డి కి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. కానీ బాలినేని పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. మంత్రి పదవిని దూరం చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వమని ప్రచారం చేస్తున్నారు. అడుగడుగునా బాలినేని అవమానాలు పడుతున్నారు. ఇటీవల నకిలీ ధ్రువపత్రాల కుంభకోణంలో పోలీస్ విచారణ తీరును నిరసిస్తూ.. తన సెక్యూరిటీ నే సరెండర్ చేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరింది. తనను వ్యక్తిగతంగా వచ్చి కలవాలని జగన్ కబురు పంపించారు. తీరా బాలినేని వెళితే జగన్ ముఖం చాటేశారు. దీంతో తన విషయంలో జగన్ ఒక స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చినట్లు బాలినేని భావిస్తున్నారు. అందుకే పార్టీ మారడమే శ్రేయస్కరమని ఒక నిర్ణయానికి వచ్చారు.

ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే తాను ఒక్కడినే కాకుండా.. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటు మరో ఇద్దరు కీలక నాయకులను తీసుకెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే జగన్ అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. వై వి సుబ్బారెడ్డి తో కలిసి తనను ఒకసారి కలవాలని బాలినేనికి సమాచారం పంపినట్లు తెలుస్తోంది. అయితే తాను ఒంటరిగానే కలుస్తానని.. వై వి సుబ్బారెడ్డి తో వచ్చి కలిసే ప్రసక్తి లేదని బాలినేని తేల్చి చెప్పినట్లు సమాచారం. మొత్తానికైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక బలమైన నిర్ణయానికి వచ్చినట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.