Homeజాతీయ వార్తలుKarnataka Elections 2023: బీజేపీ మేనిఫెస్టో : కర్ణాటకలో కమలాన్ని గెలిపిస్తుందా?

Karnataka Elections 2023: బీజేపీ మేనిఫెస్టో : కర్ణాటకలో కమలాన్ని గెలిపిస్తుందా?

Karnataka Elections 2023: ‘ఉచిత పథకాల ద్వారా ఓట్లు దండుకునే ‘జీడీల సంస్కృతి’ దేశానికి చాలా ప్రమాదకరం. ఉచితాలతో రాష్ట్రాలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. దానికి వ్యతిరేకంగా యువత నిలబడాలి’ గతేడాది గుజరాత్‌ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసి హెచ్చరిక ఇదీ. కానీ అదే బీజేపీ కర్ణాటక ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు ఉచిత మంత్రమే జపిస్తోంది. తాజాగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో అనేక ఉచిత హామీలు ఇచ్చింది. ఈ మేనిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. మరి ఈ మేనిఫెస్టో బీజేపీని గట్టెక్కించి కర్ణాటక 38 ఏళ్ల అనవాయితీని తిరగా రాస్తుందో లేదో చూడాలి.

అధికారం కోసమే ఉచితమని..
అధికారం కోసం వివిధ రాజకీయ పార్టీలు ‘ఉచిత’ వాగ్దానాలు చేస్తున్నాయని, ప్రజలు ప్రత్యేకించి యువత ఈ సంస్కృతికి వ్యతిరేకంగా నిలబడాలని గతేడాది గుజరాత్‌ ఎన్నిల సమయంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తియ్యగా ఉండే జీడీలను ఉత్తరభారతంలో పండుగలప్పుడు పంపిణీ చేస్తుంటారు. జీడీలు పంచుతూ, ఓట్లు దండుకునే సంస్కృతిని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని, ఆ సంస్కృతిలో మునిగితేలేవారు కొత్త ఎక్స్‌ప్రెస్‌ హైవేలు, విమానాశ్రయాలు, రక్షణ కారిడార్‌లు నిర్మించలేరని మోదీ చెప్పారు. ‘జీడీలు ఉచితంగా ఇవ్వడం ద్వారా ప్రజల్ని కొనేయొచ్చని వారు అనుకొంటున్నారు. ఇలాంటి ఆలోచనలను మనం సమష్టిగా ఓడించాలి. దేశ రాజకీయాల నుంచి జీడీల సంస్కృతిని తొలగించాలి’ అని కూడా పిలుపు నిచ్చారు. లేకుంటే భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కర్ణాటకలో ఓట్ల కోసం ఉచిత హామీలు..
ఉచిత హామీలకు తాము వ్యతిరేకం అన్నట్లు మోదీ ప్రకటించగా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రం కర్ణాక అసెంబ్లీ ఎన్నికల వేళ అనేక ఉచిత హామీలు ఇచ్చారు. ఈమేరకు మేనిఫెస్టోను సోమవారం విడుదల చేశారు. పేదలకు ఏడాదికి మూడు ఎల్‌పీజీ సిలిండర్లు, రోజుకు అర లీటర్‌ పాలు, అన్ని వార్డుల్లో అటల్‌ ఆహార కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో మొత్తం 103 వాగ్దానాలు ఉన్నాయి. ఈ మేనిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌.యడియూరప్ప, రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్, ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, పార్టీ సీనియర్‌ నేతలు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

గ్యాస్‌ ధర భారీగా పెంచి..
వంటగ్యాస్‌ ధరను కేంద్రం భారీగా పెంచింది. 2014కు ముందు సిలిండర్‌ ధర రూ.400 ఉండగా, మోదీ ప్రభుత్వం మూడు రెట్లు పెంచింది. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.1,200కు చేరింది. ధర తగ్గించకుండా పేదలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. ధరలు తగ్గిస్తే దేశంలోని కోట్లాది మంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగేది.

దక్షిణం గెలవాలనే..
కర్ణాటకలో 38 ఏళ్లలో ఏ పాలక పక్షం కూడా మళ్లీ అధికారంలోకి రాలేదు. ఈ చరిత్రను తిరగరాయాలని బీజేపీ భావిస్తోంది. కర్ణాటక గెలుపు దక్షిణాదిన బీజేపీ పట్టు పెంచుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా కర్ణాటకలో ఉచిత హామీలు ఇస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీజేపీ ఉచిత హామీలపై విపక్ష కాంగ్రెస్, జేడీఎస్‌లు ఆరోపణలు చేస్తున్నాయి. ఐదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular