Gujarat Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరా ఖాండ్.. ఇవీ ఇటీవల బీజేపీ గెలిచిన రాష్ట్రాలు. ఇప్పుడు ఆ జాబితాలో గుజరాత్ మళ్లీ చేరింది. కానీ ఎప్పటినుంచో దక్షిణాదిన తిరుగులేని పవర్ గా ఎదగాలి అనుకుంటున్న భారతీయ జనతా పార్టీ కల నెరవేరడం లేదు. కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ.. మిగతా నాలుగు రాష్ట్రాలు ప్రతిపక్షాల చేతిలో ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు.. ఆంధ్రప్రదేశ్లో ఇంకా గడువు ఉంది. కేరళ అది ఎప్పటికీ ఓ బ్రహ్మ పదార్థమే. ఇక మిగిలింది తెలంగాణ మాత్రమే. తెలంగాణలో మరో ఏడాదిలోపు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ అధికారాన్ని దక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ చాలా వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో విజయం సాధించిన అనంతరం తర్వాతి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

ఎందుకంటే
తెలంగాణ ప్రాంతానికి భారతీయ జనతా పార్టీకి అభినాభావ సంబంధం ఉంది. పైగా ఇక్కడ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ప్రధాన బలం. ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీతో కయ్యానికి కాలు దువ్వుతున్నది. 2018 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన నాటి నుంచి.. నిన్న మొన్న జరిగిన మునుగోడు ఉప పోరు వరకు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఉప్పు, నిప్పు అనే లాగే వ్యవహారం కొనసాగుతోంది. ఇటీవలి మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసుతో మరింత రంజుగా మారింది. అయితే ఈ కేసు ద్వారా బిజెపి పెద్దలను బయటకు లాగాలని చూసిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు అడుగడుగునా బెడిసి కొడుతున్నాయి. ఇవి ఎంతవరకు దారి తీస్తాయో తెలియదు గానీ.. ప్రస్తుతానికి అయితే కేసు విచారణ కొనసాగుతోంది.
గుజరాత్ ఉత్సాహంతో పని చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే సంకేతంతో కమలం పార్టీ నాయకులు స్పీడ్ పెంచారు. గుజరాత్ ఉత్సాహంతో పని చేయాలని సూచిస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ ప్రాంతాన్ని చుట్టివస్తున్నారు. దీంతోపాటు టిఆర్ఎస్ ప్రభుత్వంపై ధాటిగా విమర్శ లు చేస్తున్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు.. మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసుతో బిజెపిని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నించిన టిఆర్ఎస్ ను.. బెంగళూరు డ్రగ్స్ కేసు ద్వారా బండి సంజయ్ సరైన కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ మొయినాబాద్ కేసు విషయంలో అధికార టిఆర్ఎస్ కనుక ముందడుగు వేస్తే… బిజెపి కూడా అందుకు తగ్గట్టుగా కౌంటర్ ఇవ్వాలని ఆలోచిస్తున్నది.
క్రమంగా పుంజుకుంటున్నది
తెలంగాణ ప్రాంతంలో బిజెపి వేగంగా విస్తరిస్తోంది. 2018 ఎన్నికల్లో ఒక్కటే ఒక్క అసెంబ్లీ స్థానంలో గెలిచిన ఆ పార్టీ.. ఇప్పుడు తన బలాన్ని మూడుకు పెంచుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించింది. పదివేల మెజారిటీ మాత్రమే అందించి ప్రత్యామ్నాయం నేనే అని నిరూపించింది. అంతకుముందు 2018 ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలు గెలిచి టిఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ముఖ్యంగా కెసిఆర్ కూతురు కవిత పోటీ చేసిన నిజామాబాదులో బిజెపి అభ్యర్థి అరవింద్ గెలవడం ఇప్పటికి ఒక సంచలనంగానే రాజకీయవేత్తలు పేర్కొంటారు.

చేరికలకు ప్రోత్సాహం
టిఆర్ఎస్ తో అమితుమి తేల్చుకోవాలనే ఉద్దేశంతోనే బిజెపి అనేక ఎత్తులు వేస్తోంది.. ఇందులో భాగంగా ఒక అప్పటి టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుత హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఏకంగా కెసిఆర్ ఎక్కడ పోటీ చేస్తే తాను అక్కడే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు.. ప్రస్తుతం తెలంగాణలో ఇలా టిఆర్ఎస్, బిజెపి మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరుగుతోంది. ఇది ఎటువంటి పరిణామలకు దారితీస్తుందో తెలియదు గానీ.. ఇప్పుడు గుజరాత్ ఇచ్చిన ఉత్సాహంతో బిజెపి తెలంగాణలో మరింత దూకుడుగా పని చేయడం మాత్రం పక్కాగా కనిపిస్తున్నది.