BJP Dr Parthasarathi: జగన్ పాలనలో ప్రత్యర్థులకు కేసులు, జైల్లే గతి అవుతున్నాయి. ఈ మేరకు ఎవ్వరూ గట్టిగా గొంతెత్తినా సరే ఏపీ పోలీసులతో కేసులు పెట్టించి మరీ వారిని జైలుకు పంపుతున్న పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షాలు రోడ్డెక్కినా.. ఆందోళన చేసినా.. ఆఖరుకు విమర్శలు చేసినా మీదపడి విరుచుకుపడిపోతున్నారు వైసీపీ మంత్రులు , నేతలు. ఈ క్రమంలోనే వారి తీరును కడిగిపారేశారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారథి. తాజాగా మీడియా చర్చలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వైసీపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు.
వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చాక అసహనం పెరిగిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారథి అన్నారు. ప్రతిపక్షాల మీద ఏదో రకంగా పోలీస్ కేసులు బనాయిస్తోందని ఆయన అన్నారు. తాను బీజేపీ తరుఫున పోటీచేసిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆలూరు నియోజకవర్గంలోని గొదగొండ గ్రామంలో రాళ్లు రువ్వుకున్నారని.. శోభాయాత్రలో ఈ దాడులు సాగాయి. దాంట్లో ఏమాత్రం సంబంధం లేని బీజేపీ కార్యకర్తలు 60 మందిపై కేసులు పెట్టి జైలుకు పంపారని.. అసలు ఏమాత్రం సంబంధం లేని వీరిని జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని పార్థసారథి సూటిగా ప్రశ్నించారు. వాళ్లకు నిజంగా ఏమాత్రం సంబంధం లేదు. ఈ గొడవల్లో తలదూర్చలేదు. కేవలం శోభాయాత్రలో పాల్గొన్న వారిని అనుమానితులుగా చేసి ఇరికించారని ఆరోపించారు.
ఏపీలో ఎక్కడ జరిగినా ప్రతిపక్షాలకు చెందిన వారు ఎవరుంటే వారిని తీసుకెళ్లి కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని పార్థసారథి ఆరోపించారు. టీడీపీ, ఇతర పక్షాలను కూడా ఇలానే జైల్లో పెడుతున్నారన్నారు.
కేసులకు వ్యతిరేకంగా జగన్ సర్కార్ పై తిరుగుబాటు చేస్తామని పార్థసారథి సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే బీజేపీ నేతలు స్వచ్ఛందంగా వచ్చి కర్నూలు కలెక్టరేట్ ముట్టడించారని.. మాపై ఎందుకు కేసులు పెట్టారని వారంతా ప్రశ్నించారు. మాపై రాళ్ల దాడి జరిగిందని.. దెబ్బలు తిన్నామని.. చివరకు మమ్మల్నే కొట్టి మాపై కేసులు పెడుతారా? అని బీజేపీ నేతలు ప్రశ్నించిన దుస్థితి నెలకొందని పార్థసారథి వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
ఏపీలో ప్రతిపక్షాలకు సంబంధించిన కార్యకర్తలు వారి పని చేసుకునే పరిస్థితే లేదని పార్థసారథి అన్నారు. ఏదో ఒకరకంగా బీజేపీ నేతలపై కేసులు పెట్టాలని.. అణగదొక్కాలని చూస్తున్నారని.. వైసీపీ సర్కార్ కు ప్రతిపక్షాలను తొక్కేయాలన్న టెన్షన్ తప్ప వేరే ఏం లేదని ఆయన విమర్శించారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాకనే మత రాజకీయాలు పెరిగాయని పార్థసారథి ఆరోపించారు. బీజేపీ ఏనాడు మతరాజకీయాలు చేయలేదని అన్నారు. వైసీపీ అధికారంలో ఉండి ఒక మతాన్ని రెచ్చగొట్టి హిందువులను చిన్నచూపు చూడడం వల్ల వచ్చిన సమస్య ఇదీ అంటూ పార్థసారథి నిప్పులు చెరిగారు.
ఏపీలో కేసుల తీరుపై ఇప్పటికే బీజేపీ గుర్రుగా ఉంది. జనసైనికులపై కూడా వైసీపీ సర్కార్ బోలెడు కేసులు పెడుతోంది. ఈ కేసుల తీవ్రతతో బీజేపీ, జనసేన పోరాటానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా వైసీపీ పై తిరుగుబాటుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇది ఏమలుపు తిరుగుతుందన్నది వేచిచూడాలి.
Recommended Videos